భారత్‌లో మరో పాజిటివ్ కరోనా కేసు.. టెక్కీకి వైరస్

శుక్రవారం, 6 మార్చి 2020 (13:10 IST)
దేశంలో మరో పాజిటివ్ కరోనా వైరస్ కేసు నమోదైంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ వెల్లడించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 31కు చేరింది. 
 
ఢిల్లీలోని ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన కంపెనీ పనుల నిమిత్తం ఇటీవల థాయిలాండ్‌, మ‌లేషియాల్లో పర్యటించి వచ్చారు. ఆయనకు ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ అనుమానితుడిగా భావించి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 
 
అక్కడ అతని రక్తం శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ విభాగానికి పంపించారు. అక్కడ జరిగిన పరీక్షల్లో ఆ టెక్కీకి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం అధికారికంగా ప్రకటన చేసి దేశంలో మొత్తం కొవిడ్-19 కేసులు 29కి చేరినట్టు వెల్లడించారు. అలాగే, కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న మొత్తం 28,529 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. 
 
ఈ వైరస్ బారినపడిన వారిలో కేరళకు చెందిన ముగ్గురు కోలుకున్నారని వివరించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులపై ప్రత్యేక దృష్టి సారించి స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో మరో కొత్త కేసు వెలుగు చూడటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు