కరోనా కల్లోలం, బెడ్లు కొరత, టీకాలు అయిపోతున్నాయి

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:10 IST)
మహారాష్ట్రలో గురువారం 56,286 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,29,547కు చేరుకుంది. కరోనా కారణంగా గత 24 గంటల్లో 376 మంది మరణించారు. దేశంలో వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో వుంది.
 
కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మహారాష్ట్రలోని ఎనిమిది నగరాల్లో బెడ్ల లభ్యత కష్టతరంగా మారింది. ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసియు పడకల ఖాళీ 3 నుండి 18 శాతం మధ్య మాత్రమే ఉంది. నాగపూర్ ఎక్కువగా ప్రభావితమైన నగరంగా మారింది. గురువారం నాటికి ఇక్కడ మూడు వెంటిలేటర్ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
 
ఈ నగరాల్లో బెడ్ సామర్థ్యాన్ని పెంచడానికి మునిసిపల్ కార్పొరేషన్లు ఓవర్‌టైం పనిచేస్తున్నారు. ముంబైలో గురువారం 16.9 శాతం ఆక్సిజన్, ఐసియు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. పూణేలో బెడ్ ఖాళీ 14.3 నుండి 13.3 శాతానికి పడిపోయింది. నాసిక్ ఒక రోజులో 20 నుండి 18.2 శాతానికి పడిపోయింది.
 
ఇదిలావుంటే కరోనా టీకాల కొరత కూడా క్రమంగా తలెత్తుతోంది. తెలంగాణలో మరో వారం రోజుల్లో టీకాలు నిండుకుంటాయని చెపుతున్నారు. అలాగే మహారాష్ట్ర ఇప్పటికే ఈ విషయంపై కేంద్రానికి అభ్యర్థన పంపింది. రాజస్థాన్ కూడా వెంటనే టీకా మోతాదులను సరఫరా చేయాలని కోరింది. రెండు రోజుల్లో రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోతాయని పేర్కొంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరో 30 లక్షల మోతాదులను కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
 
గురువారం తనతో వర్చువల్ సమావేశం తరువాత పిఎం మోడీకి రాసిన లేఖలో, ఏప్రిల్ 7 వరకు రాష్ట్రం 86,89,770 టీకాలను ఇచ్చినట్లు తెలిపారు. రాజస్థాన్లో ప్రస్తుతం టీకా నిల్వ వచ్చే రెండు రోజుల్లో ముగుస్తుంది. అందువల్ల, కనీసం మరో 30 లక్షల మోతాదుల వ్యాక్సిన్‌ను వెంటనే మాకు అందించాలని అభ్యర్థించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు