దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు!

ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (15:03 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ కొవిడ్‌ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయ గడిచిన వారంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహమ్మారి‌ నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు. 
 
సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సన్నద్ధతను పరిశీలించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌ నిర్వహించాలని కోరారు. తాజాగా పెరుగుతున్న కేసుల నివారణను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
 
కొవిడ్‌ నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో వచ్చిన బీఎఫ్‌.7 ఉత్పరివర్తనమే ఇప్పటి వరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్‌బీబీ1.16 సబ్‌ వేరియంట్‌ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని వివరించారు. అయితే, సబ్‌వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని, అందువల్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.
 
మరోవైపు, రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాథమిక స్థాయి కొవిడ్‌ నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
 
ఇదిలావుంటే, దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 5,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,814కి పెరిగింది. కొత్తగా మరో 11 మంది మహమ్మారి వల్ల మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణాల సంఖ్య 5,30,965కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు