తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాలలోని పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామం, ఆ చుట్టు పక్కల కరోనా క్రమంగా విజృంభిస్తోంది. అక్కడ తొలికేసే మరణంతో మొదలైంది. తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక వ్యక్తి ద్వారా 116 మందికి కరోనా సోకినట్టు వైద్య శాఖ అధికారులు గుర్తించారు.
అతడి కారణంగానే గొల్లలమామిడాడలోనూ, పరిసర గ్రామాల్లో కరోనా వ్యాపించిందని అధికారులు తెలుసుకున్నారు. ఇటీవల రామచంద్రపురం గ్రామంలో ఓ కార్యక్రమం జరగ్గా, ఈ వ్యక్తి ఫొటోలు తీశాడు. అంతేకాదు, స్థానికంగా ఓ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాస్కులు కూడా పంపిణీ చేశాడు.
అయితే అతడి కుమారుడు కూడా కరోనాతో బాధపడుతుండటంతో, ఎవరి ద్వారా ఎవరికి వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే గ్రామంలో వందకు పైగా కేసులు రావడం దేశంలో ఇదే ప్రథమం కాగా, గొల్లల మామిడాడ గ్రామాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి, ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.