కరోనా టీకా గడువు ఆరు నెలలే...

బుధవారం, 27 జనవరి 2021 (11:00 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం దేశంలో జోరుగా సాగుతోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవర్ మరింత చురుగ్గా కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో నిపుణులు కీలక సూచన చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను సత్వరమే వినియోగించాలని సూచించారు. వాటి ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
కాగా, భారత్‌లో ప్రస్తుతం రెండు కంపెనీల టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందించింది. మరో 60 లక్షల డోసులు కంపెనీ వద్ద ఉన్నాయి. మరో సంస్థ వద్ద కూడా 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.
 
అందుబాటులో ఉన్న టీకాలను ఆరు నెలల లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ ఎందుకూ కొరగాకుండా పోతాయి. ఈ నేపథ్యంలో టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిపాటు ఉండేలా చూడాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం పరిశోధనలు ప్రారంభించాయి. శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మానవాళికి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు