కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు జూన్ 30వ తేదీ వరకూ కొనసాగుతాయని వెల్లడించింది. కరేనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలనూ దశల వారీగా సడలించటం జరుగుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ శనివారం విడుదల చేసింది. రాష్ట్రాలలో ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చునని చెప్పింది.
కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని.. కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. మెట్రో రైళ్లు, అంతర్జాతీయ విమానాలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద పార్కులు, బార్లు, ఆడిటోరియంలు పనిచేయవు.
బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే చోట, ప్రయాణాలు చేసేటప్పుడు ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో అందరూ ఆరు అడుగల భౌతిక దూరం పాటించాలి. ఎక్కువ మంది జనం గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వివాహాలకు 50మంది, అంత్యక్రియలకు 20 మంది మించి హాజరు కాకూడదని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.