మోదీ 2.0లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమిత్‌ షాయేనా?

శనివారం, 30 మే 2020 (17:47 IST)
''బీజేపీ ఈ ఎన్నికలకు సిద్ధంగా ఉందా, భయపడుతోందా'' అని 2019 ఎన్నికలకు ముందు ఎవరో అమిత్‌ షాను అడిగారు. ''మేం 2014 మే 27 నుంచే 2019 ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాం'' అని టక్కున సమాధానమిచ్చారు అమిత్‌ షా. చదరంగం ఆడటం అంటే ఇష్టపడే అమిత్‌షా తన ప్రత్యర్ధులను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడంలో ఆనందం పొందుతారు. మిగిలిన సాధారణ రాజకీయవేత్తలతో పోలిస్తే అమిత్‌ షా పనితీరు భిన్నంగా ఉంటుంది.

 
''అమిత్‌ షా అండ్ ది మార్చ్ ఆఫ్ బీజేపీ'' పేరుతో అమిత్‌ షా జీవిత చరిత్ర రచించిన అనిర్బన్ గంగూలీ, శివానంద్ ద్వివేది ఒకచోట ''అమేథీలోని జగదీశ్‌పూర్‌లో పర్యటిస్తున్న అమిత్‌షా హఠాత్తుగా బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కానీ కూర్చోడానికి ఎక్కడా స్థలం దొరకలేదు. చివరకు కూరగాయల నుంచి నెయ్యిని తయారు చేసే ఓ కంపెనీకి సంబంధించిన గోడౌన్‌లో ఆయన మీటింగ్‌ పెట్టేశారు. ఆ సమావేశం తెల్లవారు జామున 2 గంటల వరకు సాగింది'' అని రాశారు.

 
వాస్తవానికి జగదీశ్‌పూర్‌లో మీటింగ్‌ అయిపోగానే ఆయన లక్నో తిరిగి వెళ్లిపోతారని భావించిన బీజేపీ కార్యకర్తలు ఆయన బస కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కానీ ఆయన ఆ రాత్రి అదే గోడౌన్‌లో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. మెట్లెక్కి పడుకోవడానికి కాస్త స్థలం వెతుక్కుని అక్కడే నిద్రపోయారు. ఆయన పర్యటనల్లో బస ఏర్పాట్లు చూసే నాయకులు ఈ దృశ్యాన్ని చూశారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఇలా గోడౌన్‌లో, రేకుల కింద పడుకుని నిద్రపోవడాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.

 
మోదీ రాజయితే... అమిత్‌ షా సేనాని...
2019లో ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీకి పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాగతం పలికారు షా. మోదీ శిష్యుడి నుంచి సేనాని స్థాయికి అమిత్‌షా ఎదిగారని అప్పుడే అందరికీ అర్ధమైంది. రాజ్‌నాథ్‌సింగ్‌ స్థానంలో షాను హోంమంత్రిని చేశారు మోదీ. అయితే ఈ మార్పు రాజ్‌నాథ్‌కు ఏమాత్రం నచ్చలేదు. తన దృష్టిలో ఈ శాఖను సమర్ధవంతంగా నడపడానికి ఆయన ఏ అవకాశాన్ని వదిలి పెట్టలేదు.

 
హోంమంత్రిత్వ శాఖను అమిత్‌షాకు ఇవ్వడం ద్వారా, బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టో, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసే బాధ్యతను ఆయనకు అప్పజెప్పినట్లు చెప్పకనే చెప్పింది. ఈ అజెండాలో ఆర్టికల్ 370ను రద్దు, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రామమందిరం సమస్య పరిష్కారం, బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడం, జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేయడం, కొన్నిదేశాల నుంచి వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడంలాంటివి ఉన్నాయి.

 
పుల్వామా దాడి జరిగిన తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు. కానీ ఆ పని వెంటనే చేయలేకపోయారు. ఇలా చేస్తే ఎన్నికల్లో విజయం కోసమే తాను ఇదంతా చేశానని ప్రత్యర్ధుల నుంచి ఆరోపణలు రావచ్చు. హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత, కాశ్మీర్‌పై అందుబాటులో ఉన్న ప్రతి ఫైల్‌ను చదివిన అమిత్‌ షా, ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోవాలని మోదీకి సూచించారు.

 
ఇద్దరు నేతలు తమ దగ్గరి సలహాదారులతో చర్చించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370 ను రద్దు చేయడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని నిర్ణయించారు. అమిత్‌షా ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అమర్‌నాథ్‌ యాత్రను మధ్యలోనే నిలిపేయడంతోపాటు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను అదుపులోకి తీసుకున్నారు.

 
"అమిత్‌ షా శైలి ఎలా ఉందంటే, ఆయన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్లారు. ఎవరైనా వ్యతిరేకిస్తే, మునుపటి ప్రభుత్వాల అసమర్ధత కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని, తాము దాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామన్న సందేశం ఇవ్వగలిగారు'' అని సుప్రసిద్ధ రాజకీయ విశ్లేషకుడు, బీజేపీ నాయకత్వానికి సన్నిహితుడైన రామ్ బహదూర్ రాయ్ అన్నారు. కాశ్మీర్‌ విషయంలో కూడా అమిత్ షా మరో పెద్ద అడుగు కూడా వేశారు. ఆ రాష్ట్రంలో పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు. కాకపోతే ఇది పెద్దగా ప్రజలను ఆకర్షించలేదు. అమిత్‌షా హోంమంత్రి అయ్యాక జమ్మూకాశ్మీర్ పంచాయతీ చట్టాలను మార్చారు.

 
ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో పంచాయితీలు 29 అంశాలకుగాను 23 అంశాలలో సొంతంగా పని చేసుకోడానికి నిధులు, సిబ్బందిని పొందగలిగాయి. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రంగా జమ్మూకాశ్మీర్‌ అవతరించింది. పంచాయతీలకు ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. దాని కోసం కలెక్టర్, కమీషనర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల పంచాయితీలో స్వయం నిర్ణయంతో పాలన సాగించగలుగుతున్నాయి. రాజకీయ నాయకులు పాత్ర తగ్గింది. అయితే ఇందులో విజయం అనేది జమ్మూ కాశ్మీర్‌ పునర్నిర్మాణ ప్రక్రియ విజయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇదే అమిత్‌షాకు నిజమైన పరీక్ష.

 
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-వివాదాలు
అమిత్‌షా తీసుకున్న రెండో అతి పెద్ద నిర్ణయం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం. కొన్ని పొరుగు దేశాలను ఉద్దేశపూర్వకంగా చేర్చలేదంటూ దేశమంతటా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఇందులో హిందువులకు మాత్రమే పౌరసత్వం ఇవ్వనున్నట్లు ఉంది. అయితే దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలను గమనించాక అమిత్‌ షా ''ఇది ముస్లింలను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఈ బిల్లు ఉద్దేశం పౌరసత్వం ఇవ్వడమే తప్ప తీసేయడం కాదు'' అని ప్రకటించారు.

 
"ఈ బిల్లును ఆమోదించడానికి ముందు, హోంమంత్రి అమిత్‌షా ప్రజల అభిప్రాయాన్ని, ముఖ్యంగా మైనారిటీలను పరిగణనలోకి తీసుకోలేదు. అయోధ్య విషయంలో చేసినట్లు వారు మైనారిటీలను సిద్ధం చేయలేకపోయారు" అని ఇండియా టుడే న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ రాజ్ చెంగప్ప రాశారు.

 
''ఈ బిల్లు ఏ ఒక్క వర్గాన్ని ప్రస్తావించకుండా వచ్చినా, దీనిపై ప్రజలలో అవగాహన కలిగించలేదు. మీరు దీన్నిఎలా అర్ధం చేసుకుంటే అలా కనిపిస్తుంది. అందువల్లే నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఒకచోట అమిత్‌షా నోరుజారి సీఏఏకు ఎన్సార్సీకి సంబంధం ఉందన్నట్లు మాట్లాడారు. దీంతో రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో ప్రధాని దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నార్సీపై మంత్రిమండలిలో కూడా చర్చించలేదని ప్రకటించాల్సి వచ్చింది. వాస్తవానికి సీఏఏ విషయంలో నెహ్రూ, పటేల్‌ల అభిప్రాయానికి, ఇప్పటి ప్రభుత్వ అభిప్రాయానికి పెద్ద తేడా లేదు'' అని అన్నారు రామ్‌ బహదూర్‌ రాయ్‌.

 
రోడ్డెక్కిన వలస కార్మికుల విషయంలో అమిత్‌ షా అసంతృప్తి
కోవిడ్-19 వ్యవహారాన్ని డీల్‌ చేయడానికి అమిత్‌ షా తన హోంమంత్రిత్వ శాఖను ఒక ఏజెన్సీగా మార్చారు. ఈ మొత్తం సంక్షోభ సమయంలో ఆయన ప్రతి ఉదయం ఎనిమిదిన్నరకు నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి చేరుకుంటారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. తన మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలు, చేపట్టిన చర్యలను నిశితంగా గమనిస్తారు. దీనివల్ల కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం కుదర్చడం సులభమైంది. తన ఫైళ్ళను క్లియర్ చేయకుండా ఆయన ఇంటికి వెళ్లేవారు కాదు.

 
వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చే విషయంలో ప్రణాళికల రచనలో అమిత్‌ షా విఫలం కాలేదు. దేశ విభజన సమయంలో కూడా పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసబాట పట్టారు. అయితే ఈ తాజా గందరగోళానికి అమిత్‌షాయే కారణమని ప్రముఖ చరిత్రకారుడు రామ్‌చంద్ర గుహా నిందించారు. ''ఈ సమస్య పరిష్కరించడం చేతకాకపోతే ఈ బాధ్యతలను హోంశాఖ నుంచి వెనక్కి తీసుకోవడం మంచిది'' అనే వరకు వెళ్లారు రామచంద్ర గుహ.

 
ఈ వ్యవహారంలో అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు హోంమంత్రి అమిత్‌ షా ఇద్దరిపైనా విమర్శలు వినిపించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు సన్నాహాలు చేయాల్సిందన్న వాదన వినిపించింది. అయితే ప్రజలకు సమయం ఇస్తే వ్యాధి వ్యాప్తి వేగంగా పెరుగుతుందని మోదీ, షా క్యాంప్‌ వాదించింది. దీనిని షాక్‌ ట్రీట్‌మెంట్‌గా చాలామంది అభివర్ణించినా, విపత్తు తీవ్రతను ప్రజలు అర్ధం చేసుకున్నారు. ''ఈ ఆకస్మిక నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. ప్రజలకు మానసికంగా షాక్‌‌కు గురిచేయడం ద్వారానే వారిని మానసికంగా సిద్ధం చేయవచ్చు'' అన్నారు రామ్‌ బహదూర్‌ రాయ్‌.

 
‘‘కానీ తర్వాత రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడంలో, వారిని సిద్ధం చేయడంలో కచ్చితంగా లోపం ఉంది. కార్మికులను అలా వదిలేశారు. అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రం నుంచి కార్మికులను బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నాయి. 1991 నుంచి అనుకున్నది ఏంటంటే... గ్రామాల నుంచి 20 నుంచి 25 కోట్లమంది పట్టణాలకు రప్పించాలి అని. కానీ ఆ కల కల్ల అయ్యింది'' అన్నారాయన.

 
మోదీ, షా- రెండు శరీరాలు- ఒకే ఆత్మ
పౌరసత్వ బిల్లు ఆమోదం, ఆపై దిల్లీ అల్లర్ల తరువాత, అనేక వర్గాలలో మోదీ, షాల మధ్య తేడాలు వచ్చాయని ఊహాగానాలు నడిచాయి. అమిత్‌ షా తీవ్ర నిర్ణయాలపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాగెల్ తీవ్ర విమర్శలు చేశారు. దిల్లీలో షో మొత్తం అమిత్‌షాయే నడిపిస్తున్నారని ఆరోపించారు. అనేక విషయాలలో అమిత్‌షా, మోదీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయన్న బాగెల్‌, వాటికి ఆధారాలు మాత్రం చూపలేదు.

 
ఈ ఊహాగానాల ప్రచారం ద్వారా మోదీ, షాల మధ్య నిజంగానే విభేదాలు ఏర్పడతాయని ప్రత్యర్ధులు ఊహించారు. కానీ వాస్తవమేంటంటే.. వీరిద్దరు పరస్పర పూరకాలు. మోదీ, షా ప్రజల ముందు రెండు భిన్నవ్యక్తిత్వాలతో కనిపిస్తారు. తనను తాను దూరదృష్టి గల నాయకుడిగా మోదీ చిత్రించుకుంటే, అమిత్‌షా హిందూ ఐకాన్‌గా ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. ఒకరు అభివృద్ధికి, ఇంకొకరు హిందుత్వకు ప్రతినిధులుగా కనిపిస్తారు. తద్వారా రెండు లక్ష్యాల కోసం పని చేసే నాయకులుగా తమను తాము ఆవిష్కరించుకున్నారు.

 
వీరిద్దరి బంధం, వాజ్‌పేయి, అద్వానీ జోడీలా కనిపిస్తుంది. వీరి అభిప్రాయాలలో కొన్ని తేడాలున్నాయి. కానీ అవి పరస్పర పూరకాలు. ఉద్దేశపూర్వకంగానే వీరిద్దరు తమ రెండు ఇమేజ్‌లను ప్రదర్శిస్తారు. ''ఎజెండాలపై పోరాడటం ద్వారా మోదీని ఓడించలేమని ఆయన వ్యతిరేకులకు బాగా తెలుసు'' అని 'ది ప్రింట్' వెబ్‌సైట్ సీనియర్ జర్నలిస్ట్ రామలక్ష్మి అభిప్రాయపడ్డారు. ''మోదీ ఇమేజ్ పడిపోయినప్పుడు లేదంటే షో రన్నర్ అమిత్‌ షా ఆయనకు దూరమైనప్పుడు మాత్రమే ఆయన్ను దెబ్బతీయడం వారికి ఇది సాధ్యమవుతుంది. కానీ ఇవి రెండూ జరిగే పని కాదు. ఎందుకంటే మోదీ, అమిత్‌ షాలు రెండు శరీరాలు, ఒకే ఆత్మ'' అన్నారామె.

 
మోదీ, అమిత్‌ షాలు చాలాకాలంగా కలిసి పనిచేస్తున్నారు. గుజరాత్‌లో కూడా వారిద్దరు నంబర్ వన్, నంబర్ టూ పాత్రలో కనిపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఇద్దరూ కలిసి చాలాకాలం పని చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా వేగంగా పని చేసుకుపోవడానికి వారు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

 
గుజరాత్ హోంమంత్రిగా అమిత్‌ షా రాజకీయ జీవితంలో చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. అప్పట్లో ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆయన కొన్నాళ్లు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ నరేంద్రమోదీకి ఆయనపై నమ్మకం, మద్దతు పెరుగుతూనే వచ్చాయి.

 
అమిత్‌ షాలో మానవీయకోణం
బ్రిటీష్‌ చరిత్రకారుడు, రచయిత ప్యాట్రిక్ ఫ్రెంచ్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో, తాను ఒక డైరీ రాస్తున్నానని, అయితే అది ప్రచురణ కోసం కాదని, కేవలం తన అనుభవాలను నిక్షిప్తం చేసుకోడానికేనని అమిత్‌షా చెప్పారు. ఈ ఇంటర్వ్యూలోనే కాదు, అనేక సందర్భాలలో అమిత్‌షా తన బ్యాక్‌గ్రౌండ్‌లో రెండు ఫోటోలు కనబడేటట్లు చూసుకుంటారు. ఆ రెండు ఫోటోలలో ఉన్న వ్యక్తుల నుంచి ఆయన ప్రేరణ పొందుతుంటారు.

 
మరి ఆ రెండు చిత్రాలు ఎవరివి? వారిద్దరికీ ఆరెస్సెస్‌తో ఎలాంటి సంబంధం లేదు. వారు మరెవరో కాదు...చాణుక్యుడు, వినాయక్‌ దామోదర సావర్కార్‌. చాణుక్యుడి సామ, దాన, భేద, దండోపాయం అనే సిద్ధాంతాన్ని అమిత్‌షా తన రాజకీయా వ్యూహాలలో చక్కగా అనుసరిస్తారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా మొహమాట పడరు. హిందుత్వ అనే పదానికి సావర్కార్‌ పితామహుడని, ముస్లింలకు భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో పుణ్యభూమికాదని ఆయన గట్టిగా నమ్ముతారు.

 
అమిత్‌షా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఆయన ఎప్పుడూ చేతికి వాచ్‌ పెట్టుకోరు. అంతే కాదు...ఆయన మంచి భోజన ప్రియుడు కూడా. పకోడీలు, కారపు బూందీ తినడానికి ఆసక్తి చూపిస్తారు. పార్టీ అధ్యక్షుడయ్యే ముందు వరకు ఆయన సోనేపట్‌లోని దాభాల్లో తినడానికి వెళ్లేవారు. గురుదత్ సినిమాలను ఇష్టంగా చూసే ఆయన, సాహిర్‌ లుధియాన్వి, కైఫీ అజ్మీ గజల్స్‌ను కూడా ఆసక్తిగా వింటారు.

 
'ప్యాసా' సినిమాలో సాహిర్‌ రాసిన 'యే దునియా అగర్ మిల్ భీ జాయే' పాట ఆయనకెంతో ఇష్టం. తాను యవ్వనంలో ఉన్నప్పుడు సాహిర్ లుధియాన్వీని కలిసేందుకు ముంబై వెళ్ళడానికి ప్రయత్నించారట అమిత్‌ షా. ఇప్పుడాయ కృష్ణమీనన్‌ మార్గ్‌లోని ఓ ఇంట్లో ఉంటున్నారు. ఇదే ఇంట్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి కొంతకాలం ఉన్నారు. ఆయన తన గురువులాగే రోజంతా రాజకీయాల్లోనే గడుపుతారు. అమిత్‌షాకు రాజకీయం వృత్తికాదు, జీవితం.

 
కష్టపడి పని చేసే నేత
భారత రాజకీయాల్లో అమిత్‌షాలాగా కష్టపడి పనిచేసే రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ తన ''2019 - హౌ మోదీ వన్ ఇండియా'' పుస్తకంలో ''ఒకసారి నేను ఉదయం 6.40 విమానంలో లక్నో వెళ్తున్నాను. ఉదయాన్నే లేవడంతో నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, జుట్టు చెల్లాచెదురుగా ఉంది.

 
అమిత్‌షా తెల్లని కుర్తా పైజామా ధరించి విమానంలోకి ప్రవేశించారు. ఆయన కోల్‌కతా నుంచి అర్థరాత్రి తిరిగి వచ్చారు. ఆరు గంటల తర్వాత మళ్లీ విమానంలో ఉన్నారు. నేను సాయంత్రం వచ్చి ఇడ్లీ తిన్నాను. కానీ అమిత్‌షా తినడానికి నిరాకరించారు. తాను ఆ రోజు ఉపవాసంలో ఉన్నందున నీరు మాత్రమే ఇవ్వండని ఎయిర్ హోస్టెస్‌ను కోరారు. యాదృచ్ఛికంగా, మేము ఇద్దరం ఒకే హోటల్‌లో ఉన్నాము" అని గుర్తు చేసుకున్నారు రాజ్‌దీప్‌.

 
రాజ్‌దీప్ మరో ఉదంతాన్ని కూడా చెప్పారు. "రాత్రి సుమారు 11 గంటలకు హోటల్ కారిడార్‌లో గందరగోళంగా ఉంది. భద్రతా సిబ్బందితో మాట్లాడి షా తన గదికి చేరుకున్నారు. అప్పటికే ఆయన్ను కలవడానికి పార్టీ నేతలు క్యూ కట్టారు. ఈ సమావేశం పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటింది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు నేను నిద్రలేచాను. అమిత్‌షా గదికి వెళ్లి మాట్లాడదామనుకున్నాను. కానీ, నేను ఆయన గదికి చేరుకునే సరికి ఆయన ఉదయాన్నే ఢిల్లీ వెళ్లిపోయారని నాకు తెలిసింది. దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తి దినచర్య ఈ ఒక్కరోజే కాదు, ప్రతి రోజూ ఇలాగే ఉంటుందని నేను గ్రహించాను'' అని రాజ్‌దీప్‌ తన పుస్తకంలో రాశారు.

 
ఎంపీలకు హోంవర్క్‌లు
మోదీ తర్వాత పార్టీ చీఫ్‌గా అమిత్‌ షా పెద్ద హోదా పొందారు. మోదీ ప్రభుత్వపు రెండో ఎడిషన్‌లో ఒక్క సంవత్సరంలోనే ఆయన ప్రభుత్వంపై తన పట్టును పెంచుకున్నారు. ఒకప్పుడు మోదీ ప్రభుత్వం అని పిలిచేవారు. ఇప్పుడు 'మోదీ-షా' ప్రభుత్వం అంటున్నారు. "అమిత్‌షా తాను సాధారణ రాజకీయ నాయకుడిని కాదని స్పష్టంగా చూపించారు. తాను ఏదైనా ఒక అంశంపై చర్చించే ముందు బాగా హోంవర్క్‌ చేస్తారు. కేవలం పార్టీ అజెండాను చదివి వినిపించరు. పౌరసత్వ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఎంపీలందరిపైనా పైచేయి సాధించారు. భారత పార్లమెంటులో ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూ అంత బాగా మాట్లాడిన వ్యక్తి చాలాకాలం తర్వాత అమిత్‌ షా రూపంలో కనిపించారు. నోట్స్ చూడకుండా, ఎటువంటి సహాయం లేకుండా పార్లమెంటులో మాట్లాడగల నేతలు గత మూడు దశాబ్దాలలో ఇద్దరే ఉన్నారు. ఒకరు చంద్రశేఖర్, మరొకరు ఎల్‌.కె.అద్వానీ. అమిత్‌ షా కూడ అదే కోవలోకి వస్తారు‘’ అని 'ది సండే గార్డియన్' ఎడిటర్‌ పంకజ్ వోహ్రా రాశారు.

 
బీజేపీలోని ఆయన అభిమానులు, అమిత్‌ షా నిజమైన రాజకీయాలను విశ్వసించే నాయకుడని చెబుతారు. ఆయన జీవిత చరిత్ర రాస్తున్న రచయితలు అనిర్బన్‌ గంగూలీ, శివానంద్‌ ద్వివేది ఒక సంఘటన గురించి చెప్పారు.

 
''ఒకసారి ఆయన తనకు బాగా పట్టున్న నరన్‌పురా స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు తన విజయంపై నమ్మకం గట్టి నమ్మకముంది. కానీ ఎన్నికల ప్రచార సమయంలో తన కాంగ్రెస్ ప్రత్యర్థి జితుభాయ్‌ పటేల్‌వి 500 పోస్టర్లు అంటించమని ఆయన తన మద్దతుదారులను కోరారు. ఎందుకిలా అని సహచరులు ప్రశ్నించినప్పుడు 'మనం గెలుస్తామని నమ్మకం కుదిరితే కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా ఇంటి దగ్గరే కూర్చుంటారు. అలా కాకుండా పోటీ గట్టిగా ఉందని తెలిస్తే ప్రతి ఒక్కరు ఓటేయడానికి వస్తారు' అని వివరించారు అమిత్‌షా. ఈ ఎన్నికల్లో ఆయన 63 వేల ఓట్లు సాధించారు’’ అని తెలిపారు.

 
మోదీ తర్వాత ఆయనేనా?
మోదీ తర్వాత ఆయనేనని రాజకీయ సర్కిళ్లలో చర్చ జరుగుతుంటుంది. మోదీ కూడా ఈ చర్చను కొనసాగించడానికి అవకాశం ఇస్తుంటారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా కనిపించింది. అమిత్‌షా కూడా తానే హౌస్‌ లీడర్‌నన్న భావన కల్పించారు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎంపీలంతా ''భారత్‌ మాతాకీ జై'' అంటూ నినాదాలు చేశారు.

 
ఆ రోజు ప్రధాని సభకు రాకపోవటానికి కారణం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటమేనని చెబుతారు. కాని కొంతమంది బీజేపీ నాయకుల అభిప్రాయం ప్రకారం ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసారు. బిల్లును ఆమోదింపజేసినందుకు ఆ ఘనత అమిత్‌షా ఖాతాకు చేరుతుంది. ఆయన్ను అందరూ మోదీ వారసుడిగా చూస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు