దేశంలో తగ్గని కోవిడ్ ఉధృతి : ఒక్క రోజులో 29 వేల పాజిటివ్ కేసులు

బుధవారం, 15 జులై 2020 (14:52 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా గడచిన 24 గంటల్లో ఏకంగా 24 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు. కాగా, మంగళవారం వరకు దేశంలో మొత్తం 1,24,12,664 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,20,161 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణాలో 1524 కేసులు 
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,524 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 37,745కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 815 కొత్త కేసులు వచ్చాయి. మంగళవారం 1,161 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 24,840కి పెరిగింది. ప్రస్తుతం 12,531 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాలు 375కి పెరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు