తమిళనాడులో కరోనా విజృంభణ.. కాశ్మీర్, మణిపూర్‌లో పూర్తి లాక్ డౌన్

బుధవారం, 22 జులై 2020 (19:59 IST)
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 5,849 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,492కు చేరింది. అందులో వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారు పోగా మరో 51,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
ఇక కరోనా మరణాలు కూడా తమిళనాడులో భారీగా నమోదవుతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 74 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2700కు చేరింది.
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో కొత్తగా 254 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,346 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
అలాగే పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. 14 రోజుల పాటు ఈ లాక్‍డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. నిత్యావసర సేవలను మాత్రమే అనుమతించనున్నట్టు పేర్కొంది. 
 
మరోవైపు గత మూడు వారాలుగా కరోనా కేసులు అధికమవుతున్నందున అధికారులు కాశ్మీర్ లోయలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. బందిపోరా జిల్లా మినహా మొత్తం కాశ్మీర్ లోయలో బుధవారం నుంచి ఆరో రోజులపాటు లాక్‌డౌన్ ఉండనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు లాక్‌డౌన్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. వ్యవసాయం, నిర్మాణ కార్యాకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు