పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఐవీఆర్

మంగళవారం, 20 మే 2025 (22:51 IST)
కోవిడ్ 19 కేసులు క్రమంగా దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు, జాగ్రత్తలు వెల్లడించింది. 
దగ్గుతున్నా, తుమ్ముతున్నా చేతి రుమాలు లేదా టిష్యూ పేపరును ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవాలి.
తరచూ చేతులు కడుక్కుంటూ వుండాలి, సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత లిక్విడ్ ఉపయోగిస్తూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు అరచేతిని అడ్డుపెట్టుకోకుండా మోచేయి లోపలభాగాన్ని అడ్డుగా పెట్టుకోవాలి.
కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా ప్రాధమిక కేంద్రానికి సమాచారం ఇచ్చి వారి నుంచి తగు సాయం పొందవచ్చు.
జన సమూహాలకు దూరంగా వుండాలి. 
కనీసం మీ చేయి చాచితే ఎంతదూరం వుంటుందో మరో మనిషి నుంచి అంతదూరం వుండాలి.
కంటికి సరిపడా నిద్రపోవాలి.
కావలసినంత మేర మంచినీళ్లు, పండ్ల రసాలతో పాటు పోషకాలు సమృద్ధిగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి.
 
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల మేరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడటం గమనార్హం. 
 
అయితే, దేశంలో ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా వంటి దేశాల్లో మాత్రం కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం కొంతమేర భారత్‌పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. 
 
ఇకపోతే కేసుల వారీగా పరిశీలిస్తే, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసుల ప్రభావం అధికంగా ఉంది. గత వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు వార్తలు వచ్చినప్పటికీ అవి కోవిడ్ మరణాలు కాదని వైద్యులు ధృవీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు