చెన్నైలో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా ... పుట్టగొడుగుల్లా కొత్త కేసులు

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (08:54 IST)
చెన్నై మహానగరంలో విధులు నిర్వహించే జర్నలిస్టుల్లో ఇద్దరికీ కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని పాత్రికేయ వర్గాల్లో కలకలం రేగింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఓ తమిళ దినపత్రిక విలేకరితో పాటు మరో తమిళ న్యూస్ చానెల్‌కు చెందిన సబ్ ఎడిటర్‌కు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ పరీక్షల్లో తేలింది. 
 
ఈ కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారిలో ఒకరిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, సబ్ ఎడిటర్‌ను గవర్నమెంట్ స్టాన్సీ హాస్పిటల్‌కు తరలించి క్వారంటైన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ నిలకడగానే ఉందని తెలిపారు.
 
మరోవైపు, స్థానిక ఆలందూరులోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న 52 యేళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆయన్ను కూడా జీహెచ్‌కు తరలించారు. 
 
ఇక ఈ ముగ్గురూ కాంటాక్ట్ అయిన ఉద్యోగులను, మిత్రులను, వారు తిరిగిన ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, తమిళనాడులో తొలి కరోనా కేసు మార్చి 8న నమోదైన సంగతి తెలిసిందే. 
 
చెన్నై మహానగరానికి ఏమైంది? 
 
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్క ఆదివారమే ఒక్క చెన్నై నగరంలోనే ఏకంగా 50 కేసులు నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 105 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,477కు చేరింది. 
 
ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నగర వాసులు భయంతో వణికిపోతున్నారు. ఆదివారం ఇద్దరు తమిళ విలేకరులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విలేకరుల కోసం ప్రత్యేకంగా కరోనా వైరస్ నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా పరిశీలిస్తే, ఒక్క చెన్నై జిల్లాలో మొత్తం 285 కేసులు నమోదు కాదా, ఆ తర్వాత స్థానంలో కోయంబత్తూరు 133, తిరుపూరులో 108, దిండిగల్‌లో 74, ఈరోడ్‌లో 70, తిరునెల్వేలిలో 62, చెగల్పట్టులో 53, నామక్కల్‌లో 50 చొప్పున నమోదు కాగా, అతి తక్కువగా అరియలూరులో2, కల్లకుర్చిలో 3, పెరంబలూరులో 4, కాంచీపురంలో 8, నీలగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, తమిళనాడులో కరోనా బారినపడి ఇప్పటివరకూ 15 మంది చనిపోయారు. ఆదివారం కరోనా నుంచి కోలుకున్న 46 మందిని డిశ్చార్జ్ చేయడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 411కు చేరింది. ఇదిలావుంటే.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ సడలింపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు