2023 ప్రపంచ కప్ భారత్‌లోనే... పాక్ ఆడుతుందో లేదో?

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:09 IST)
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఇదివరకే 2023 ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుందని ప్రకటించినప్పటికీ భారత్‌లో పన్ను మినహాయింపు ఇస్తారో లేదో అనే కారణంగా టోర్నీ ఇక్కడ జరిగే అవకాశాలు లేవనే అభిప్రాయం ఉండేది. అయితే ఐసిసి ఛీఫ్ డేవ్ రిచర్డ్‌సన్ తాజాగా చేసిన ప్రకటనలో 2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని, దీనితో పాటు 2021లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్‌లోనే ఉంటుందని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ప్రకటించారు.
 
2016లో భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనందున ఈసారి వరల్డ్‌కప్ భారత్‌లో జరిగే అవకాశం లేదని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవాలని, 2023 వరల్డ్‌కప్ ఖచ్చితంగా భారత్‌లోనే జరుగుతుందని రిచర్డ్ ప్రకటించారు. ఇంకా రిచర్డ్ మాట్లాడుతూ ప్రపంచకప్ నిర్వహణకు పన్ను మినహాయింపు అనివార్యమని, ఇందులో వచ్చే ప్రతి రూపాయిని తిరిగి క్రికెట్ కోసమే ఖర్చు పెడతామని తెలిపారు.
 
అయితే ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను రద్దు చేసుకున్నందున, అలాగే ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతున్నందున ఇందులో పాకిస్థాన్ ఆడుతుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ పాకిస్థాన్ పాల్గొన్నప్పటికీ గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్ తలపడే అవకాశాలు లేవని రిచర్డ్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు