పాకిస్థాన్‌ చేతిలో భారత్ ఓటమి: ఆ పాపం కూడా కోహ్లీదే.. కుంబ్లే మాట వినలేదట..?

శుక్రవారం, 23 జూన్ 2017 (14:46 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ, ఫైనల్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్ ఓడిపోయేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని జోరుగా ప్రచారం జరుగుతోంది. కోచ్ అనిల్ కుంబ్లేతో ఏర్పడిన విబేధాల కారణంగా అతనిచ్చిన సలహాను పక్కనబెట్టడంతోనే చేతులారా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ టీమ్ ఓడిపోయిందని సమాచారం. కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా విషయంలో.. కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్ల ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కుంబ్లే పట్ల టీమిండియా ఆటగాళ్లు, కోహ్లీ ఫిర్యాదు చేయడంతో... కోహ్లీ అహంకారం బయటపడింది. ఈ అహంకారం అతని అభిమానుల సంఖ్యను తగ్గిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఘటన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. ఎన్నెన్ని విబేధాలున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా.. దేశం కోసం.. జాతి కోసం ఆడే క్రికెటర్లు వాటిని పక్కనబెట్టి మైదానంలో దిగాల్సి వుంటుంది. అయితే ఇక్కడ సీన్ రివర్సైంది. 
 
వివరాల్లోకి వెళ్తే... ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌‌లో భారత్‌పై టాస్ నెగ్గితే బ్యాటింగ్ తీసుకునే తప్పిదం చేయవద్దని దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బ్యాటింగ్‌లో బలంగా ఉన్న టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్ధేశించాలని ఎంతో మంది వెటరన్ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టాస్‌కు వెళ్లే ముందు కోహ్లీకి కోచ్ కుంబ్లే టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాల్సిందిగా సూచించాడు. 
 
అయితే కోహ్లీ అహంకారంతో కుంబ్లే మీద ప్రతీకార చర్యగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతే పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్థాన్ కప్ గెలిచింది. ఈ పాపం కూడా కోహ్లీదేనని తెలియరావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి