కోహ్లీ పేరిట మరో రికార్డు - వేగంగా రన్స్ చేసిన క్రికెటర్లలో స్థానం

ఆదివారం, 29 నవంబరు 2020 (17:19 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా, ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ సాగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో వన్డే మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఇందులో భారత జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అలాగే, కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఆసీస్‌కు భారీ స్కోర్లు క‌ట్ట‌బెట్టిన కోహ్లి సేన‌.. ఈ క్ర‌మంలో తాను ఆడిన మొత్తం 978 వ‌న్డేల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్లు టీమిండియాపై సెంచ‌రీకిపైగా భాగస్వామ్యం నెల‌కొల్ప‌డం ఇదే తొలిసారి. రెండు వ‌న్డేల్లోనూ ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్ సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్స్ నెల‌కొల్పారు. వీళ్లు తొలి వికెట్‌కు తొలి వ‌న్డేలో 156, రెండో వ‌న్డేలో 142 ప‌రుగులు జోడించారు. 
 
ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివరి వ‌న్డేలో ఆ టీమ్ ఓపెన‌ర్లు మార్టిన్ గప్టిల్‌, హెన్రీ నికోల్స్ కూడా తొలి వికెట్‌కు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. ఈ సిరీస్‌లో 0-3తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. 1975 నుంచి వ‌న్డేలు ఆడుతున్న టీమిండియా గ‌తంలో ఎప్పుడూ ఇలా వ‌రుస‌గా మూడుసార్లు ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్ల‌కు వంద‌కుపైగా భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పే అవ‌కాశం ఇవ్వ‌లేదు. 
 
అలాగే, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 22,000 పరుగులు పూర్తిచేసుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 89 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లలో కలిపి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 
ఓవరాల్‌గా చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మేటి బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 రన్స్), కుమార్ సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేళ జయవర్ధనే (25,957), జాక్వెస్ కలిస్ (25,534), రాహుల్ ద్రావిడ్ (24,208), బ్రయాన్ లారా (22,358) ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు