ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్లు వచ్చే యేడాది జూలై నాటికి భారత్‌లో అందుబాటులోకిరానున్నాయి.
ఇదే అంశంపై ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ స్పందిస్తూ, వచ్చే యేడాది జులై నాటికి భారత్‌లోని 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
కోల్‌కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో వర్చువల్ పద్ధతితో ఆయన మాట్లాడుతూ, 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
భారత్‌లో దేశ ప్రజల కోసమే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా టీకా తయారీ అవుతోందని చెప్పారు. దేశంలో 24 వ్యాక్సిన్ తయారీ యూనిట్లు, 19 కంపెనీలు కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉంటుందని, ప్రస్తుతం ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వాటిలో రెండు భారత్‌లో తయారవుతున్నాయని, మిగతా 3 విదేశాలకు చెందినవని అమిత్ షా తెలిపారు.
కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ సరిపోదని, కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు. నిబంధనలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని తెలిపారు.
కరోనా సోకినప్పటికీ లక్షణాలు లేని వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, వారితో పోల్చితే కరోనా లక్షణాలు ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు తెలిపారు.
కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉంటుందని చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచాలని చెప్పారు. వివిధ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిపై వారు పరిశోధన జరిపి ఈ ఫలితాలను వెల్లడించారు.
ఆఫీసులు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇళ్లలోనే కరోనా వేగంగా వ్యాపిస్తుందని, కరోనా సోకిన వ్యక్తితో వరుసగా ఐదు రోజులు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు. లక్షణాలు లేనివారి వల్ల తక్కువగా కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటికీ ఈ తరహా వ్యాప్తిని అడ్డుకోవడం సవాల్‌గా మారిందని తెలిపారు.