గత 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు "క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు వరించనుంది. అలాగే, భారత మాజీ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కూడా జీవిత సాఫల్య పురస్కార అవార్డుతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సత్కరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
గత 2019 తర్వాత తొలిసారిగా బీసీసీఐ ఈ అవార్డుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తోంది. తొలి టెస్టుకు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశాలున్నాయి.
కాగా 61 ఏళ్ల రవి శాస్త్రి భారత్ తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రెండు పర్యాయాలు భారత క్రికెట్ జట్టుకు కోచ్ కూడా వ్యవహరించారు. 2014 నుంచి 2016 వరకు టీమిండియా డైరెక్టర్‌గా, అనంతరం టీమ్ కోచ్ కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. 2021 టీ20 వరల్డ్ కప్ వరకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా టెస్టు సిరీస్ విజయాలు సాధించడం రవిశాస్త్రి కోచింగ్ కాలంలో ప్రధాన ఘనతగా ఉంది. అయతే శాస్త్రి కోచ్‌గా, కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయింది. 2019లో డబ్ల్యూటీసీ ఫైనల్, 2019లో వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు టీమిండియా చేరుకోగలిగింది. ఇక యువక్రికెటర్ శుభమాన్ గిల్ 2023లో అదరగొట్టాడు. వన్డేల్లో వేగంగా 2000 పరుగులను పూర్తి చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి.
ఇదిలావుంటే, 2023 ఏడాదికి గాను అత్యుత్తమ టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కలేదు. అయితే జట్టు కెప్టెన్‌గా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది.
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు జట్టులో చోటుదక్కింది. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లకు జట్టులో స్థానం కల్పించింది. ఐసీసీ టీ20 జట్టులో వరుసగా రెండో ఏడాది సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.
జట్టులో ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్డ్, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్ మన్, జింబాబ్వేకు చెందిన సికందర్ రాజా, ఉగాండా ఆల్ రౌండర్ అల్పేశ్ రంజానీ, వికెట్ కీపర్‌గా వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్, ఐర్లండ్‌కు చెందిన మార్క్ అడైర్, జింబాబ్వేకు చెందిన రిచర్డ్ నగర్వాను ఎంపిక చేసింది.