ఐపీఎల్ 14 సీజన్ : మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబరులో...

గురువారం, 6 మే 2021 (12:57 IST)
స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను వచ్చే సెప్టెంబరు నెలలో నిర్వహిచనున్నారు. 
 
ఐపీఎల్ 14  సీజన్‌లో పాల్గొనే ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా బయోబబుల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని కూడా కరోనా రక్కసి ధాటుకుని ఆటగాళ్లకు సోకింది. ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీ నిలిపివేయక తప్పలేదు. 
 
ఐపీఎల్ తాజా సీజన్‌ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ... మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబరులో నిర్వహించాలని ఆలోచిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరులో ఐపీఎల్ రెండో దశ నిర్వహణకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చిస్తున్నాయి.
 
ఒకవేళ భారత్‌లో అప్పటికి కరోనా పరిస్థితులు సద్దుమణగకపోతే ప్రథమ ప్రాధాన్యతగా ఇంగ్లండ్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలన్నది బీసీసీఐ ఆలోచనగా ఉంది. ఎందుకంటే, వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోనే జరుగనుంది. ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా... ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్‌లో ఆడతుంది. 
 
ఆ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపైనే ఐపీఎల్ రెండో భాగం జరపాలని భారత క్రికెట్ పెద్దలు ప్రతిపాదిస్తున్నారు. ఇంగ్లండ్‌లో అయితే విదేశీ ఆటగాళ్లకు కూడా పెద్దగా ఇబ్బందులేవీ ఉండవన్నది బోర్డు వర్గాల ఆలోచన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు