లారాకు కరోనా సోకిందంటున్న నెటిజన్స్ - లేదురా బాబోయ్ అంటున్న మాజీ క్రికెటర్

గురువారం, 6 ఆగస్టు 2020 (13:08 IST)
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కరోనా వైరస్ బారినపడినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమకుతోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం లారా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తనకు కరోనా వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేయొద్దంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా వ్యాప్తి సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రముఖులకు కరోనా వచ్చిందంటూ కొందరు ప్రచారం చేస్తుండడంతో అటువంటి వార్తలను నమ్ముతున్న సెలబ్రిటీల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా, వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్ బ్రియా‌న్ లారాకు కరోనా సోకిందని ప్రచారం సాగడంత ఆయన స్పందించారు. 
 
త‌నపై వ‌స్తున్న ఆ ప్రచారమంతా అసత్యమేనన్నారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింద‌ని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో త‌న గురించి అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతోం‌ద‌న్నారు. 
 
ఇటువంటి ప్రతికూల ప్రచారాలను వ్యాప్తిచేయ‌డానికి కొవిడ్‌-19 సంక్షోభాన్ని వాడొద్దని ఆయన సూచించారు. తనకు క‌రోనా పాజిటివ్ అని తేలిందంటూ ప్ర‌చార‌మ‌వుతున్న అస‌త్య వార్త‌ల‌ను తాను చ‌దివాన‌ని ఆయన వివరించారు. ప్రజలకు నిజాలను తెలపాల్సిన అవ‌స‌రం ఉం‌ద‌ని ఆయన చెప్పారు.
 
కొవిడ్‌-19 కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న స‌మాజంలో ఇటువంటి అస‌త్య వార్త‌లను ప్ర‌చారం చేసి ప్రజల్లో భ‌యాందోళ‌న‌ల‌ను వ్యాప్తి చేయ‌డం సరికాద‌ని తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలతో త‌న‌ను ప్ర‌భావితం చేయలేర‌ని  ఆయన చెప్పారు. అయితే, త‌న శ్రేయోభిలాషులను మాత్రం ఈ అసత్య వార్తలు ఆందోళ‌న‌కు గురిచేశాయ‌ని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు