క్వింటన్ డికాక్ ఊరమాస్ బాదుడు.. వెనక్కి తగ్గిన కోహ్లీ - రోహిత్

బుధవారం, 25 అక్టోబరు 2023 (10:04 IST)
భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మొత్తం పది జట్లు పాల్గొనగా, వాటిలో ఒకటి సౌతాఫ్రికా. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఊరమాస్ బాదుడుకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. తన వీరబాదుడుతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యిలా మారారు. ఫలితంగా సౌతాఫ్రికా విజయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన డికాక్ మూడు సెంచరీలు చేశాడు. దీన్నిబట్టే అతను ఏ స్థాయి ఫామ్‌లో ఉన్నాడో ఇట్టే గ్రహించవచ్చు. 
 
ముఖ్యంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరింత విధ్వంసం సృష్టించాడు. 140 బంతులు ఎదుర్కొని 174 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అనూహ్య మార్పులు జరిగిపోయాయి. 
 
మంగళవారం వరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్ తొలి రెండు స్థానాల్లో ఉండేవారు. కానీ బంగ్లాపై 174 పరుగులు సాధించడంతో డికాక్ ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. మొత్తం 407 పరుగులతో డికాక్ అగ్రస్థానంలో ఉండగా 354 పరుగులతో రెండో స్థానంలో కోహ్లీ, 311 పరుగులతో రోహిత్, 302 పరుగులతో రిజ్వాన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
 
డికాక్ బంగ్లాదేశ్‌పై 174 పరుగులు, శ్రీలంకపై 100, ఆస్ట్రేలియాపై 109 చొప్పున పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు క్వింటన్ డికాక్‌ను వెనక్కి నెట్టే బ్యాటర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లి మరో 53 పరుగుల దూరంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ రాణిస్తే మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లడం ఖాయం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు