ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. డికాక్ 174, క్లాసెస్ 90, మార్ క్రమ్ 60 చొప్పున పరుగులు చేశఆరు. చివరులో మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సఫారీలు భారీ స్కోరు చేశారు.
ముంబై వాంఖడే స్టేడియం పిచ్‌పై మరోసారి పరుగుల వర్షం కురిసింది. అచ్చొచ్చిన పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మరోసారి చెలరేగిపోయారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ బ్యాట్‌తో వీరవిహారం చేయగా, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌కు చుక్కలు కనిపించాయి.
డికాక్ స్కోరులో 15 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. డికాక్ దూకుడుకే దిక్కుతోచని స్థితిలో పడిన బంగ్లా బౌలర్లు... క్లాసెన్ మాస్ బ్యాటింగ్‌కు బెంబెలెత్తిపోయారు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 90 పరుగులు చేసి తన దూకుడును రుచిచూపాడు. ఈ క్రమంలో 2 ఫోర్లు, 8 భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు.
మ్యాచ్ ఆఖరులో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో చకచకా 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (60) అర్థసెంచరీతో రాణించాడు.
సఫారీ బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు ఉతికారేయడంతో బంగ్లా బౌలర్ల వేదన వర్ణనాతీతం. దక్షిణాఫ్రికన్లు ఆఖరికి కెప్టెన్ షకీబల్ హసన్‌ను కూడా వదలకుండా బాదారు. బంగ్లా బౌల్లలో హసన్ మహ్మద్ 2, మెహిదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, కెప్టెన్ షకీబల్ హసన్ ఒక్కో వికెట్ తీశారు.