ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును తన పేరుమీద లిఖించుకుంది. అదీకూడా ఇప్పట్లో చెరిగిపోని విధంగా ఈ రికార్డును నమోదు చేసింది. ఈ రికార్డు కోసం ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఊచకోత కోశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 481 పరుగులు చేసింది. ఫలితంగా ప్రత్యర్థి జట్టుపై ఏకంగా 242 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయం కూడా ఓ సరికొత్త రికార్డు కావడం గమనార్హం.
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలుచుకున్న ఇంగ్లండ్, మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసి గత రికార్డును బద్దలుగొట్టారు.
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 481 పరుగులు చేసి అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశారు. 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లండ్ తానే బద్దలు కొట్టింది. ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని చేరుకుంటుందని భావించినా చివర్లో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో 481 పరుగులతోనే సరిపెట్టుకుంది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లో అలెక్స్ హేల్స్ 92 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 147 పరుగులు చేయగా, ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 92 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ 61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82, ఇయాన్ మోర్గాన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ స్కోరు పరుగులు పెట్టి 481 వద్ద ఆగింది.
ఆ తర్వాత 482 పరుగుల భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు 37 ఓవర్లలో 239 పరుగులకే కుప్పకూలారు. ఫలితంగా 242 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ ప్లంకెట్ మూడు, డేవిడ్ విల్లీ రెండు వికెట్లు తీశారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ 51, మార్కస్ స్టోయిన్స్ 44 పరుగులు చేశారు. అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.