సినీ నటులు డాక్టర్ మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేస్తూ జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టివ్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది.
ఈ కేసులో ఏపీ హైకోర్టు ఈ యేడాది జనవరి 2న ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తమ కాలేజీకి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు, విష్ణులు 2019 మార్చి 22న సిబ్బంది, విద్యార్థులతో కలిసి శ్రీవిద్యానికేతన్ నుంచి తిరుపతి - మదనపల్లె రోడ్డుపై ర్యాలీ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారని, అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదుచేశారు.
తాము ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా ధర్నా చేసినా పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని, ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా దానికింద కేసు పెట్టినందున కొట్టేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇందులోని నిజానిజాలు ట్రయల్ కోర్టులో విచారణ ద్వారానే తేలాల్సి ఉందన్న కారణంతో హైకోర్టు వీరి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఇద్దరూ ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 22న ఇరుపక్షాల వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. చంద్రగిరి పోలీసు స్టేషనులో 2019 మార్చి 23న నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్, దాని ఆధారంగా దాఖలుచేసిన ఛార్జిషీట్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్ఎస్ఐఆర్, ఛార్జిషీట్లను కలిపి చదివిన తర్వాత అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్ధం కావట్లేదని వ్యాఖ్యానించింది. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గానీ, ప్రజలకు హాని తలపెట్టినట్లు గానీ చూపలేకపోయినట్లు పేర్కొంది.