ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు - లూయిస్ సిక్సర్ల వర్షం

శనివారం, 17 జులై 2021 (11:10 IST)
తమ సొంత గడ్డపై పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐదో ట్వంటీ20 మ్యాచ్‌లో విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్ విధ్వంసం సృష్టించడంతో సునాయాసంగా గెలుపొందింది. 
 
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వీరబాదుడే పనిగా పెట్టుకున్న లెవిస్లూ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 34 బంతులెదుర్కొన్న లెవిస్‌ 79 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. 
 
ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల చేసింది. లెవిస్‌కు జతగా గేల్‌ 21, కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 31, సిమన్స్ 21 సహకరించడంతో భారీ స్కోరు నమోదైంది. ఆసీస్‌ బౌలర్లలో అండ్రూ టై 3, ఆడమ్‌ జంపా, మిచెల్‌ మార్ష్‌ చెరో రెండు వికెట్లు తీశారు.
 
ఆ తర్వాత 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు.. 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆరోన్‌ ఫించ్‌ 34, మిచెల్‌ మార్ష్‌ 30 పరుగులు చేశారు. బ్యాటింగ్‌లో విఫలమైన రసెల్‌ బౌలింగ్‌లో మాత్రం ఇరగదీశాడు. కాట్రెల్‌తో పోటీ పడుతూ రసెల్‌ 3 వికెట్లు తీశాడు.
 
కాగా ఐదు టీ20ల సిరీస్‌ను విండీస్‌ 4-1 తేడాతో అందుకొని ఆసీస్‌కు షాక్‌ ఇచ్చింది. ఇక ఇరు జట్ల మధ్య  మూడు వన్డేల సిరీస్‌ జూన్‌ 20 నుంచి మొదలుకానుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా లెవిస్‌ నిలవగా.. ఇక సిరీస్‌ ఆధ్యంతం నిలకడగా బౌలింగ్‌ కనబరిచిన హెడెన్‌ వాల్ష్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు