తమిళనాట గతేడాది జనవరిలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సాధారణంగా తమిళనాడులో సంక్రాంతి పండుగకు జల్లికట్టు నిర్వహిస్తారు. మధురై, తిరుచ్చి, అలంగానల్లూర్ సహా తమిళ రాష్ట్రంలో పలుచోట్ల ఈ క్రీడకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో 2014లో సుప్రీంకోర్టు నిషేధానికి గురైన ఈ క్రీడను న్యాయబద్ధం చేస్తూ తమిళనాడు అసెంబ్లీ చట్టం చేసింది.
తమిళనాడు ప్రజలు సంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టును ఆడుకోవచ్చంటూ కేంద్రం కూడా పచ్చజెండా ఊపింది. తాజాగా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ తరహాలోనే జల్లికట్టు ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్‌ను తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్పు సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ పోటీలు జనవరి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లో జరగనున్నాయి. అయితే ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహణ గురించి జల్లికట్టు క్రీడకు మొదట్నుంచి వ్యతిరేకత తెలియజేస్తున్న జంతుహక్కుల సంఘాలు ఇంకా స్పందించలేదు. అయితే జల్లికట్టు ప్రీమియర్ లీగ్ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. తమిళనాడు రాజధాని చెన్నై పేరిట ''చెన్నై సూపర్ బుల్స్'' పేరుతో జల్లికట్టు జట్టు రెడీ అవుతోంది.