పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

ఠాగూర్

ఆదివారం, 5 అక్టోబరు 2025 (16:53 IST)
తన పార్టీ ఎమ్మెల్యేలకు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందులో పవన్ దిశానిర్దేశం చేశారు. 
 
ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఐదు నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని సూచించారు. జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ క్రమంలో వారితోపాటు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, తద్వారా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతుంది, అక్కడి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏ విధంగా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం లాంటి విషయాలపై దృష్టి సారించాలన్నారు. 
 
అదే సందర్భంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కల్పిస్తున్న రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాల అన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, రహదారుల అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం శాసన సభాపక్షం నుంచే ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ వేసుకొందామన్నారు. ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలని తెలిపారు.
 
జనసేన పార్టీకి మిలీనియర్స్ బలంగా నిలిచారు. అదే క్రమంలో వారి ఆకాంక్షలు గ్రహించాలన్నారు. వారితోపాటు 'జెన్ జీ' తరంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, చర్చిస్తూ ఉండాలని సూచించారు. ఈ తరం వారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థం అవుతాయని, వారు తీసుకొస్తున్న ఆవిష్కరణలు తెలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌ను ఎలా నిర్మించి, ఎన్ని వందల కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టిందీ కూడా నవ తరానికి స్పష్టంగా తెలుసునని అన్నారు. 
 
మనం ఖచ్చితంగా రుషికొండ ప్యాలెస్‍‌ను సద్వినియోగపరచడంపై బలంగా దృష్టిపెట్టాలన్నారు. నిర్ధిష్ట కాల వ్యవధిలో రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వానికి మన పార్టీ తరఫున ఆలోచనలు తెలియచేయాలని సూచించారు. జెన్ జి తరం అభివృద్ధికి, వారి ఉపాధి ఉద్యోగావకాశాలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు