30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

ఠాగూర్

ఆదివారం, 5 అక్టోబరు 2025 (10:36 IST)
గత 30 యేళ్లుగా తన కాలులో ఇనుప రాడ్లు ఉన్నాయని ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ అన్నారు. పైగా, తన అన్న సన్నీ డియోల్ లేకపోతే విరిగిన తన కాలు తిరిగి వచ్చేది కాదని, ఇపుడు ఇలా నిలబడటానికి కూడా కారణం ఆయనేనని చెప్పారు. 30 యేళ్ల క్రితం ఓ సినిమా చిత్రీకరణలో తనకు జరిగిన ప్రమాదం గురించి బాబీ దేవోల్‌ తాజాగా గుర్తుచేసుకున్నారు. తన అన్న సన్నీ డియోల్ లేకపోతే తన విరిగిన కాలు వచ్చేది కాదని భావోద్వేగానికి గురయ్యారు.
 
'నాకు ఇంకా గుర్తుంది. నా తొలి చిత్రం 'బర్సాత్‌' షూటింగ్‌ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. నా కెరీర్‌ ప్రారంభం కాకముందే ముగిసిపోతుందని భావించాను. సన్నీ డియోల్ లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. ఆ సినిమా ఇంగ్లండ్‌ షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు మరో గుర్రం ఎదురుగా రావడంతో బలంగా కిందపడిపోయా. దీంతో నా కాలు విరిగింది. నిలబడలేక కుప్పకూలిపోయాను. నా అదృష్టం కొద్ది సన్నీ ఆరోజు నాతోనే ఉన్నారు. అతను నన్ను తన భుజాలపై మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు నా కాలు ఇక రాదని చెప్పారు. రాత్రికి రాత్రే సన్నీ నన్ను లండన్‌లోని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ శస్త్రచికిత్స చేశారు'
 
'ఇప్పటికీ 30 సంవత్సరాల అయినప్పటికీ నా కాలులో ఆ రాడ్‌లు అలానే ఉన్నాయి. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ నేను వాటికి అలవాటు పడ్డాను. అందరిలానే నడవగలను, పరుగెత్తగలను, డ్యాన్స్‌ చేయగలను, దూకగలను.. ఇంకేం కావాలి. అందుకే వాటి గురించి అసలు ఆలోచించను. కానీ, ఆ సంఘటన తర్వాత నాకు మా అన్నయ్యపై ప్రేమ రెట్టింపైంది' అని బాబీ చెప్పారు. 
 
ఇక 'యానిమల్‌' సినిమా తర్వాత బాబీ బాగా బిజీగా మారారు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'వార్‌ 2'లో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'జన నాయగన్‌'లో నటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు