7 పరుగులు కోసం 109 బంతులు.. క్రికెట్‌ను హత్య చేశాడు.. హనుమపై సుప్రియో
సోమవారం, 11 జనవరి 2021 (18:44 IST)
Hanuma Vihari
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యమనే చాలా మంది అనుకున్నారు. కానీ గాయాలు వేధిస్తున్నా రిషబ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ వెన్ను చూపకుండా పోరాడిన తీరు అద్భుతం. ఈ సిరీస్‌లో పెద్దగా ఫామ్‌లో లేని విహారికి వచ్చీ రాగానే గాయమైంది.
గజ్జల్లో గాయం కారణంగా అతడు పరుగెత్తలేకపోయాడు. అందువల్ల తరచూ ఒకటి, రెండు పరుగులు తీసే అవకాశం వచ్చినా అతడు పరుగెత్తలేదు. ఎలాగోలా వికెట్లకు అడ్డుగోడలా నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే చాలన్న పట్టుదలతో ఆడాడు. మధ్యలో బ్రేక్ దొరికినప్పుడల్లా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరో ఒకరు వచ్చి విహారికి పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉన్నారు. పంత్, విహారి మోతాదు కంటే ఎక్కువే పెయిన్ కిల్లర్స్ తీసుకున్నట్లు టీమ్ వర్గాలు వెల్లడించాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్ట్ 5 వ రోజు, భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మాన్ హనుమా విహారి, సీనియర్ భారత క్రికెటర్ ఆర్ అశ్విన్ తో కలిసి మెరుగ్గా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతులాడిన హనుమ విహారి.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్దే రనౌటయ్యాడు. దాంతో.. అతనిపై పతాక స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతని డిఫెన్స్‌పై కొంత మంది నెటిజన్లు పెదవి విరిచారు.
కానీ.. కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే.. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టం. అదీ 272 పరుగులకే ఐదు టాప్ ఆర్డర్ వికెట్లు చేజారిన తర్వాత.. డ్రా కోసం ప్రయత్నించడం మేలు. అదే హనుమ విహారి చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. ఒకవేళ హనుమ విహారి కాస్త దూకుడుగా ఆడి ఔటై ఉండింటే..? ఆ తర్వాత మిగిలిన నాలుగు వికెట్లని తీయడం ఆస్ట్రేలియా బౌలర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చు. మరీ ముఖ్యంగా.. జడేజా బొటనవేలికి గాయం కావడంతో అతను మునుపటి తరహాలో ఆడలేకపోవచ్చు.
హనుమ విహారి పట్టుదల, ఏకాగ్రతకి కామెంటేటర్ హర్షాభోగ్లే ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే..? విజయలక్ష్మీ గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడుఅని విహారి తల్లిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో హనుమ విహారి డిఫెన్స్‌పై ఓ నెటిజన్ నెగటివ్‌గా కామెంట్ చేశాడు. దాంతో.. అతనికీ హర్భాభోగ్లే సమాధానమిచ్చాడు. అయితే హనుమ విహారీపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణమైంది. విహారీ తాను ఎదుర్కొన్న మొదటి 109 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి క్రికెట్‌ను హత్య చేశాడని చెప్పాడు. పరుగులు రాణించడంతో హనుమ విహారి దూకుడు ఆడకపోవడం విమర్శలకు దారి తీసింది.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో హనుమ విహారిపై విమర్శలు గుప్పించారు. ''7 పరుగులు చేయడానికి 109 బంతులు ఆడటం! ఇది దారుణం హనుమ విహారి.. భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని సాధించటానికి లభించిన అవకాశాన్ని చంపేయడమే కాకుండా, క్రికెట్‌ను కూడా హత్య చేశాడంటూ ట్వీట్ చేశారు. అయితే హనుమ విహారీపై బాబుల్ సుప్రియో చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. క్రికెట్ వదిలిపెట్టి... రాజకీయాలపై దృష్టి పెట్టమని హితవు పలుకుతున్నారు. అలాగే టీమిండియా ప్రస్తు కెప్టెన్ రహానే విహారిపై ప్రశంసలు గుప్పించారు.