ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో.. నేడు లంకతో భారత్ పోరు

గురువారం, 2 నవంబరు 2023 (08:34 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ పరిస్థితుల్లో గురువారం శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. 
 
మరోవైపు, క్లాలిఫికేషన్ మ్యాచ్‌లలో సూపర్ షోతో టైటిల్ ఫైట్‌కు దూసుకొచ్చిన శ్రీలంక ఆటతీరు ఇపుడు మరింత అధ్వాన్నంగా ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాల ద్వారా నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ పోటీలోనూ ఓడితే.. టోర్నీ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టే. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన భారత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. 
 
ఇదిలావుంటే, హార్దిక్ పాండ్యా గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి.. రెండు మ్యాచ్‌లలో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా మొత్తం తొమ్మిది వికెట్లతో తన స్థాయి నిరూపించుకున్నాడు. అయితే మున్ముందు కీలక పోటీలకు షమి ఎంత అవసరమో తెలిసిన కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్మెంట్ అతడిని సేవలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే.. లీగ్ దశలో తదుపరి సవాళ్లకు పేస్ దళపతి బుమ్రా ఇంకా ఉత్సాహంతో సిద్ధం కావాల్సివుంది. 
 
మరోవైపు, యువ ఆటగాళ్లు గిల్, శ్రేయాస్‌లు మైదానంలో రాణించాల్సివుంది. వీరి వైఫల్యమే కాస్త ఆందోళనగా ఉంది. మెగా టోర్నీకి ముందు ఆడిన వన్డేలలో అదరగొట్టిన గిల్, అయ్యర్.. అసలు పోరులో ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నారు. డెంగీ జ్వరంతో టోర్నమెంట్ ఆరంభ రెండు మ్యాచ్‌లను మిస్సయిన గిల్.. తిరిగి వచ్చాక ఆడిన పోటీల్లో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. ఇక షార్ట్ పిచ్ బంతులను ఆడడంలో బలహీనతను అధి గమించి శ్రేయాస్ భారీ స్కోర్లు చేయాల్సివుంది. 
 
వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో చక్కగా ఆడిన లంక.. తీరా అసలు సమరంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టును దెబ్బ తీసింది. ఓ సెంచరీ, మరో అర్థ శతకంతో 931 పరుగులు సాధించిన దీర్ఘ సమరవిక్రమ, ఈసారి టోర్నీలో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన పతుమ్ నిస్సాంకపైనే శ్రీలంక ప్రధానంగా ఆధారపడుతోంది. 
 
వాంఖడే పిచ్‌పై ఎప్పుడూ పరుగుల పండుగే. ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగ్గా, రెండుసార్లూ తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా వరుసగా 399, 382 పరుగులు సాధించింది. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటుంది. వర్ష సూచన లేదు.
 
భారత్ అంచనా.. : రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయాస్, సూర్యకుమార్, జడేజా, బుమ్రా, షమి, సిరాజ్, కుల్దీప్. శ్రీలంక అంచనా.. : కుశాల్ మెండిస్ (కెప్టెన్ /కీపర్), నిస్సాంక, కరుణరత్నే, సమరవిక్రమ, అస లంక, మాథ్యూస్, వెల్లలగే/ధనంజయ డిసిల్వా, రజిత, తీక్షణ, మధుశంక, చమీర. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు