ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్ : భారత్‌ను గెలిపించిన వరుణుడు

బుధవారం, 2 నవంబరు 2022 (17:59 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. చివరి ఓవర్, చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50), విరాట్ కోహ్లీ (64 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (30), అశ్విన్ (13) చొప్పున రాణించారు. మిగిలిన ఆటగాళ్లలో రోహిత్ 2, హార్దిక్ పాండ్యా 5, దినేష్ కార్తీక్ 7, అక్షర్ పటేల్ 7 చొప్పున పరుగులు చేయగా, అదనంగా మరో 13 పరుగులు వచ్చాయి. ఫలితంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు విజయాన్ని వర్షం అడ్డుకుంది. బంగ్లా ఆటగాళ్లు మంచి జోరుమీద ఉన్న సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ విధానం మేరకు బంగ్లాదేశ్ విజయాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదిరించారు. చివరకు ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. 
 
ఆ జట్టు ఆటగాళ్లలో షాంతో 21, దాస్ 60, షాకీబ్ అల్ హాసన్ 13, నురుల్ హాసన్ 25, టస్కిన్ అహ్మద్ 12 చొప్పున పరుగులు చేసినప్పటికీ విజయానికి కాస్త దూరంలో వచ్చి ఆగిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు భారత్‌ను ఓడించినంత పని చేశారు. బంగ్లాదేశ్ ఓడినప్పటికీ తమ ఆటతీరుతో, అద్భుతమైన పోరాటం చేసి ఓటమిపాలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు