దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, భారత క్రికెట్ జట్టు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. సెమీస్ ఆశలు వదులుకునే స్థితిలో వుంది. అయితే, ఒక్క అద్భుతం జరిగితే మాత్రం కోహ్లీ సేన సెమీస్ రేసులో ఉంటుంద. లేకుంటే మూట ముల్లె సర్దుకుని ఫ్లైట్ ఎక్కాల్సివుంటుంది.
ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో గెలిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో చిత్తుగా ఓడింది. ఆప్ఘన్ జట్టుపై మాత్రం భారీ పరుగుల తేడాతో గెలిచింది. కానీ, సమీస్‌కు మాత్రం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా, శుక్రవారం గ్రూప్-2లో న్యూజిలాండ్, నమీబియా పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుతుంది. ఓడిపోతే మాత్రం టీమిండియాకు లాభిస్తుంది. తన చివరి రెండు మ్యాచ్‌లను టీమిండియా భారీ తేడాతో నెగ్గితే న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
ఈ మ్యాచ్‌లో కాకపోయినా, తన తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనైనా న్యూజిలాండ్ ఓడిపోవాలన్నది భారత అభిమానుల ఆశ! ఆప్ఘనిస్థాన్ జట్టుకు సంచలనాలు కొత్తేమీ కాదు. ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!