ఆఖరి మెట్టుపై బోర్లాపడిన భారత్... కప్ చేజారింది.. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

ఆదివారం, 19 నవంబరు 2023 (21:58 IST)
లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీస్‌లో అదరగొట్టిన టీమిండియా ఫైనల్ మ్యాచ్‌కు వచ్చే సరికి బొక్క బోల్తాపడింది. అభిమానులకు ఏ మూలనో ఉన్న అనుమానాలను నిజం చేస్తూ ఆఖరి పోరాటంలో ఓడిపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడిన భారత్.. ఆ తర్వాత మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీనికితోడు నాసిరకమైన బౌలింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌.. 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది. ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 137, 15 ఫోర్లు, 4 సిక్సర్లు), సెంచరీతో చెలరేగగా మార్నస్‌ లబూషేన్‌ (110 బంతుల్లో 58 నాటౌట్‌, 4 ఫోర్లు)రాణించి ఆసీస్‌కు ఆరోసారి వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీని అందించారు. 
 
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు వరుసగా షాకులు తగిలాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియన్లు ఎక్కడా కంగారు పడలేదు. ఆసీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షమీ.. డేవిడ్‌ వార్నర్‌ (7)ను ఔట్‌ చేయగా మిచెల్‌ మార్ష్‌ (15)ను బుమ్రా ఐదో ఓవర్లో ఔట్‌ చేశాడు. తన మరుసటి ఓవర్లోనే బుమ్రా..  స్మిత్‌ (4)ను కూడా ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్, టీమిండియా అభిమానులు ఆనందపడిన క్షణాలంటే ఇవే. ఆ తర్వాత, అంతకుముందూ అంతా ఆసీస్‌దే ఆధిపత్యం.
 
ఇదిలావుంటే, 47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ట్రావిస్‌ హెడ్‌ మరోసారి ఆ జట్టుకు ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. భారత బౌలర్లు కట్టడి చేసినప్పుడు సంయమనంతో ఆడిన హెడ్‌ ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. లబూషేన్‌ కూడా అతడికి తోడ్పాడునందించడంతో హెడ్‌ వీరవిహారం చేశాడు. అర్థ సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన హెడ్‌.. 95 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. 
 
హెడ్‌ - లబూషేన్‌ల జోడీ క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌కు వికెట్ల రాకే గగనమైంది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌కు తిరుగులేని విజయాన్ని అందించి భారత అభిమానులకు మరోసారి గుండెకోతను మిగిల్చారు. పుష్కరకాలం తర్వాత స్వదేశంలో కప్పు గెలవాలన్న భారత కల మరోసారి చెదిరింది. ఫలితంగా భారత్ ఓడిపోగా, ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు