రోహిత్ శర్మ సెంచరీ వృధా.. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి 1000వ విజయం...

శనివారం, 12 జనవరి 2019 (18:00 IST)
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గిన భారత జట్టు వన్డేల్లో చుక్కెదురైంది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన వన్డేలో భారత్‌ పరాజయం పాలైంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో విజృంభించినా.. కోహ్లీసేనకు పరాజయం తప్పలేదు. రోహిత్ శర్మ, ధోనీ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లు కంగారూల బౌలింగ్‌కు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 
 
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు సాధించింది. పీటర్ హ్యాండ్స్ కూంబ్ (73), షాన్ మార్ష్ (54), ఉస్మాన్ ఖవాజా (59)లు అర్థ సెంచరీలతో అదరగొట్టడానికి తోడు మార్కస్ స్టోయినిస్ (47) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు సాధించింది. దీంతో 289 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఓ దశలో నాలుగు పరుగులకే మూడు టాప్ ఆర్డర్ వికెట్లను భారత్ కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడిన రోహిత్ శర్మ, ధోనీ ఆదుకున్నారు.  సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు.  రోహిత్‌ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా... ధోనీ డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ధోనీతో కలిసి 136 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం జోడించి భారత్‌ను పోటీలో నిలిపాడు రోహిత్. 93 బంతుల్లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ ఔటయ్యాడు. 
 
ధోనీ-రోహిత్ నాలుగో వికెట్‌కు 171 బంతుల్లో 137 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ అవుట్ అయ్యాక రోహిత్ ఒంటరి పోరాటం చేశాడు. 129 బంతుల్లో పది ఫోర్లు, ఆరు సిక్సర్లు 133 పరుగులు చేసిన రోహిత్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. 129 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్సర్లు 133 పరుగులు చేసిన రోహిత్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా జట్టు విజయం ఖాయమైంది. 
 
10 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఇది 1000వ విజయం కావడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు