ఆసియా క్రికెట్ టోర్నీ : నేడు దాయాదుల సమరం..

ఠాగూర్

ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (09:25 IST)
ఆసియా క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దాయాదులు తొలిసార తలపడబోతున్నాయి. 
 
ఇప్పటికే ఈ రెండు జట్లూ ఆడిన తమతమ మొదటి మ్యాచ్‌లలో ఘన విజయం సాధించాయి. యూఏఈని భారత్ చిత్తు చేస్తే.. ఒమన్‌పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఇటీవల భారత్‌ దూకుడు మామూలుగా లేదు. ప్రస్తుతం భారతే టీ20 ప్రపంచ ఛాంపియన్ అన్న సంగతి తెలిసిందే. 
 
నిరుడు పొట్టి కప్పు మొదలైనప్పటి నుంచి 28 టీ20లు ఆడితే.. కేవలం మూడు మాత్రమే ఓడింది. ఆసియా కప్ తొలి పోరులోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ప్రపంచ కప్‌ల్లో పాక్‌పై భారత్‌కు అద్భుత రికార్డుంది. గత ఏడాది కూడా పొట్టి కప్పులో ఆ జట్టుపై పైచేయి సాధించింది. 
 
బలాబలాల్లోనూ భారత్ ముందు పాకిస్థాన్ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాక్.. ఈ మ్యాచ్ గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డుతుందనడంలో సందేహం లేదు.
 
పాతుకుపోతున్న అభిషేక్ శర్మకు.. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్ జత కలిశాడు. యూఏఈపై ఈ ఇద్దరూ రాణించారు. నిరుడు దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు అజేయ శతకాలు సాధించిన తిలక్ వర్మ. మళ్లీ మెరుపులు మెరిపించడం కోసం తహతహలాడుతున్నాడు. కెప్టెన్ అయ్యాక అంచనాల మేర రాణించలేకపోయిన సూర్యకుమార్.. ఓ పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. 
 
గిల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేసిన సంజు శాంసన్ అయిదో స్థానంలో ఆడే అవకాశముంది. తర్వాత హార్దిక్, అక్షర్‌తో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగులో బుమ్రాపై జట్టుకు శుభారంభాలను అందించాల్సిన బాధ్యత ఉంది. అతడితో హార్టిక్ కొత్త బంతిని పంచుకుంటాడు. 
 
యూఏఈపై ఆదరగొట్టిన శివమ్ దూబె... పాక్‌పై ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. కుల్దీప్, వరుణ్, అక్షర్‌తో స్పిన్ విభాగానికి డోకా లేదు. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. బాబర్ అజామ్, రిజ్వాన్ లాంటి సీనియర్లను పక్కన పెట్టాక యువ ఆటగాళ్ల మీదే ఆ జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. కానీ వాళ్లు అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి