కోల్‌కతా ట్వంటీ20 : కాస్త కష్టంగా లక్ష్యఛేదన.. భారత్ బోణీ

సోమవారం, 5 నవంబరు 2018 (09:44 IST)
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 110 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కాస్త కష్టంగా ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌), క్రునాల్‌ పాండ్యా (9 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌), మనీష్‌ పాండే (24 బంతుల్లో 2 ఫోర్లతో 19) కీలకంగా నిలిచారు. 
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. కుల్దీప్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి నెగ్గింది. 
 
దీంతో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన క్రునాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా ఆకట్టుకున్నారు. రెండో టీ20 లోక్నోలో ఈనెల 6వ తేదీన జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు