ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడాన్ని అనేక మంది భారత సీనియర్ మాజీ క్రికెటర్లు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఈ ఓటమిని దురదృష్టంగానే భావించిన సచిన్.. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడాక చివరికి ఒక్క మ్యాచ్‌లో అదృష్టం ముఖం చాటేస్తే హృదయం బద్ధలైపోతుందన్నారు.
"ఆటగాళ్ల ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటములన్నది ఆటలో భాగం. ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ జట్టు ఈ టోర్నీ ఆసాంతం అత్తుత్తమ ఆటతీరు కనబర్చింది." అని ఓదార్పు వచనాలు పలికారు.
మరోవైపు, జగజ్జేత ఆస్ట్రేలియాకు సచిన్ అభినందనలు తెలిపారు. ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్‌ను ప్రదర్శించారు" అంటూ సచిన్ ఆసీస్ ఆటగాళ్లను కొనియాడారు.