ఫించ్ ఖాతాలో అరుదైన రికార్డు
మరోవైపు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరన్ ఫించ్ తన ఖాతాలో మరో ఘనతను వేసుకున్నాడు. వన్డేల్లో అయిదు వేల పరుగులు సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. శుక్రవారం సిడ్నీ వేదికగా భారత్‌తో ప్రారంభమైన తొలి వన్డేలో ఫించ్ ఆ రికార్డును సాధించాడు. ఫించ్‌కు ఇది 130వ వన్డే. అతని కెరీర్ సగటు 40.98గా ఉంది. వన్డేల్లో ఫించ్ మొత్తం 16 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయిని దాటిన ఆసీస్ క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.
ఆ ప్లేయర్ల జాబితాలో పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మార్క్ వా, క్లార్క్, స్టీవ్ వా, బేవన్, బోర్డర్, హైడెన్, జోన్స్, బూన్, వాట్సాన్, హస్సీ, మార్టిన్, వార్నర్, సైమండ్స్ ఉన్నారు. ఫించ్ కేవలం 126వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. వార్నర్ ఈ ఘనతను కేవలం 115 మ్యాచుల్లోనే అందుకున్నాడు. వన్డేల్లో 5 వేల మార్క్‌ను దాటిన రెండవ ఫాస్టెస్ట్ ఆసీస్ ప్లేయర్‌గా ఫించ్ నిలవడం విశేషం.
కాగా, ఈ సిరీస్‌కు అభిమానులను కూడా స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. సిడ్నీలో జరిగే తొలి వన్డేకు 50 శాతం మాత్రమే నిండేలా ప్రేక్షకులను అనుమతించారు. 9 నెలల తర్వాత టీమిండియా ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.