ప్రపంచాన్న వణికిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకాను కనిపెట్టేందుకు పలు దేశాలు విస్తతృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు దేశాలు తయారు చేసిన టీకాలు 70 నుంచి 90 శాతం మేరకు సమర్థవంతంగా పని చేస్తున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి.
ఈ క్రమంలో ఒక వేళ కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అపుడు తొలి దశలో సుమారు 30 కోట్ల మంది భారతీయులకు వచ్చే యేడాది జూలై నాటికి టీకాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ దిశగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ టీకాను తీసుకునేవారిలో ప్రథమంగా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉండనున్నారు.
వీరేకాకుండా 50 ఏళ్లు దాటిన వారితో పాటు అనారోగ్యంగా ఉన్న యువతకు కూడా ఈ టీకాను తొలి దశలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు. కోవడ్ టీకా పంపిణీకి సంబంధించి నేషనల్ వ్యాక్సిన్ కమిటీ అధిపతి డాక్టర్ వీకే పౌల్ తుది కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాఘవన్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు కోవిడ్ టీకాలు కావాల్సిన స్థాయిలో అందుబాటులో ఉంటాయన్నారు.
వ్యాక్సిన్ ఫలితాల నివేదిక విడుదలైన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం వ్యాక్సిన్‌పై జరుగుతున్న అధ్యయనంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయని, అందువల్లే మరోమారు ట్రయల్స్‌కు వెళుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో అధిక రోగ నిరోధక శక్తి పెరిగినట్టు రిపోర్టులు రాగా, దీని ఆధారంగానే వ్యాక్సిన్‌ను మరింత లోతుగా విశ్లేషించనున్నామన్నారు. అయితే, తాజా ట్రయల్స్ చాలా త్వరితగతినే పూర్తవుతాయని, చాలా దేశాల్లో ఇది జరుగుతుందని వ్యాక్సిన్ పనితీరుపై అంతర్జాతీయ అధ్యయనం తర్వాత దీన్ని విడుదల చేస్తామని తెలిపారు.