ఉత్కంఠపోరులో టీమిండియా జయభేరి... 500వ విక్టరీ...

మంగళవారం, 5 మార్చి 2019 (21:59 IST)
నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఆటలో భారత్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. దీనితో ఆసీస్ ఆటగాళ్లు 49.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. 251 పరుగల లక్ష్య ఛేదనలో చతికిలపడ్డారు. దీనితో భారత్ విజయం సాధించింది. ఈ విజయం టీమిండియాకు 500వ విజయం. 
 
ఇకపోతే 251 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(38) , అరోన్ ఫించ్ (37) తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆట తీరును చూసినవారు ఇక భారత్ గెలుపు కష్టం అనుకున్నారు. ఈ దశలో కుల్దీప్ ఫించ్‌ను ఔట్ చేయడంతో ఒక్కసారి కుదుపు వచ్చింది. ఆ తర్వాత మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 
 
బూమ్రా కూడా విజృంభించడంతో ఆసీస్ బ్యాట్సమన్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఆ దశలో స్టోనిస్ వీరవిహారం చేయడంతో ఆసీస్ గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ రంగప్రవేశం చేయడంతో ఆసీస్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. మొదటి బంతికే స్టోనిస్ వికెట్ పడగొట్టడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన జాంబా కూడా రెండు బంతులకే ఔట్ అవడంతో భారత్ విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు