ఇంతకాలం సొంతగడ్డపై తమకు ఎదురేలేదని బీరాలకు పోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు తేరుకోలేని అతిపెద్ద షాక్ తగిలింది. ఏడు దశాబ్దాలుగా టీమిండియాపై ఆస్ట్రేలియా చూపెడుతున్న ఆధిపత్యానికి ఎట్టకేలకు చెక్ పడింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన కోహ్లీ సేన... నాలుగో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చారిత్రక సిరీస్‌ను కైవసం చేసుకుంది.
అంతకుముందు ఆదివారం నాలుగో రోజు కూడా భారత్ ఆధిక్యమే కొనసాగింది. కుల్దీప్ యాదవ్ (5/99) స్పిన్ దెబ్బకు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. 2005 తర్వాత ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించడం ఇదే తొలిసారి. నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు ఫాలోఆన్ ఆడారు.
ఓ దశలో 6 గంటల వరకు మ్యాచ్‌ను కొనసాగించాలని భావించినా సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఎట్టకేలకు 5.20 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దయ్యే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. చివరి రోజైన సోమవారం కూడా మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.