ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లండ్‌పై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లండ్‌పై 60 పరుగుల తేడాతో కోహ్లీసేన ఖంగుతింది. ఫలితంగా సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది.
నాలుగో టెస్టులో మొయిన్ అలీ బంతులకు భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. నాలుగో రోజు ఆదివారం 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 69.4 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (58), రహానె (51) అర్ధ సెంచరీలతో నాలుగో వికెట్‌కు 101 పరుగులు జత చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లంతా చేతులెత్తేశారు.
విజయం కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆది నుంచే తడబాటుకు గురైంది. 22 పరుగులకే టాప్ ఆర్డర్ పెవిలియన్‌లో కూర్చుంది. ఈ దశలో జట్టును కెప్టెన్ కోహ్లీ, రహానె ఆదుకున్నారు. ధావన్ (17), రాహుల్ (0), పుజారా (5) పేలవమైన షాట్లతో అవుటయ్యారు.
కోహ్లీ 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 51వ ఓవర్‌లో బంతి కోహ్లీ గ్లోవ్స్‌కు తగిలి షార్ట్ లెగ్‌లో కుక్ చేతిలో పడింది. దీంతో నాలుగో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. టీ విరామం తర్వాత భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే పాండ్యాను స్టోక్స్ అవుట్ చేశాడు.