ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

ఠాగూర్

శుక్రవారం, 3 అక్టోబరు 2025 (20:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శనివారం నుంచి అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ నగరంలోని సింగ్ నగర్‌లో ఉన్న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఈ పథకం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే, మరో 20 అజెండా అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించింది.
 
అలాగే, ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024-29  అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్‌ పర్యాటకానికి, అమృత్‌ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి భూసేకరణ విషయంలో కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. 
 
అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు