రో'హిట్' మేన్ దెబ్బకి బిక్కచచ్చిపోయిన పాక్ బౌలర్లు, బాబర్ టీమ్ చిత్తుచిత్తు

శనివారం, 14 అక్టోబరు 2023 (20:17 IST)
ప్రపంచ కప్ 2023 పోటీల్లో భాగంగా శనివారం నాడు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దెబ్బకు బాబర్ సేన బెంబేలెత్తిపోయింది. బంతి వేస్తే రోహిత్ ఎక్కడ సిక్స్, ఫోర్ కొడతాడోనన్న భయంలో పాకిస్తాన్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. రోహిత్ శర్మ ఎప్పటిలానే తన దూకుడు ఆటతో వరుస సిక్సర్లు, ఫోర్లతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మోత మోగించాడు. టీమిండియా అభిమానులకు కనువిందు చేసాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లో 6x6, 6X4 తో 86 పరుగులు చేసాడు. ఇఫ్తికర్ వేసిన బంతికి షహీన్ ఆఫ్రిదికి చిక్కకపోయి వుంటే సెంచరీతో మరో రికార్డు సృష్టించి వుండేవాడు. మొత్తమ్మీద టీమిండియా విజయానికి గట్టి పునాది వేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్ల భుజాలపై బరువు దించేసాడు. 
 
గంపెడాశలు పెట్టుకున్న శుభమన్ గిల్ కేవలం 16 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కోహ్లి కుదురుకుంటాడులే అనుకునేలోపు అదే 16 పరుగుల వద్ద హసన్ అలీ బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 79 పరుగులే. రెండు కీలక వికెట్లు తీసిన సంతోషంలో పాక్ బౌలర్లు పండగ చేసుకున్నారు. కానీ వారు ఆశలపై నీళ్లు చల్లుతూ రోహిత్ శర్మ పాక్ బౌలర్ల బంతులను ఊచకోత కోశాడు. ఎంతమాత్రం జంకు లేకుండా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
 
రోహిత్ శర్మకు శ్రేయస్ అయ్యర్ జత కలవడంతో ఇద్దరూ కలిసి బాధ్యతాయుతంగా ఆడుతూ వచ్చారు. రోహిత్ శర్మ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్ మరోసారి పాక్ క్రికెటర్లకు టెస్ట్ క్రికెట్ రుచి చూపించాడు. క్రీజులో వీరిద్దరూ పాతుకుపోయి అడపాదడపా చిన్నచిన్న షాట్లు కొడుతూ క్రమంగా భారత్ స్కోర్ కార్డును పైకి పెంచుతూ వచ్చారు. వీరిద్దరి వికెట్లు తీయాలన్న పాకిస్తాన్ బౌలర్ల ఆశ ఎంతమాత్రం తీరలేదు. మరో 19 ఓవర్లు మిగిలి వుండగానే శ్రేయాస్ అయ్యర్ విజయానికి అవసరమైన చివరి బంతిని ఫోర్‌గా మలిచి అర్థసెంచరీని సాధించడంతో టీమిండియా విజయబావుటా ఎగురవేసింది. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో నాటవుట్ గానూ, కెఎల్ రాహుల్ 19 పరుగులతో నాటవుట్‌గా నిలిచారు.

పాక్ బ్యాట్సమన్లను చిదిమేసిన సిరాజ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ సమరం ఆసక్తికరంగా జరుగింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పాకిస్థాన్‌తో జట్టుపై వరల్డ్ కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టాడు. రెండు కీలక వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్.. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బతీశాడు. 
 
క్రాస్ సీమ్ డెలివరీతో పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(20)‌ను ఔట్ చేసిన సిరాజ్.. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(50) స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ఆఫ్‌స్టంప్ బెయిల్స్‌ను తాకేసింది. ఈ బాల్‌ను చూసి బాబర్ ఆజామ్ బిత్తరపోయాడు. అక్కడ్నించి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. మొదట సాద్ షకీల్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత హార్డ్ హిట్టర్ ఇఫ్తికార్ అహ్మద్‌ను బౌల్డ్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు