సంగారెడ్డిలో రిటైర్ అయిన ఉద్యోగిని వసుధ ఆమె భర్త ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం సికింద్రాబాదులో 39 తులాల బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసారు. ఆ తర్వాత బస్సులో ప్రయాణించి తమ ఇంటికి చేరుకుని బంగారం బిస్కెట్లు పెట్టిన బ్యాగు కోసం చూస్తే అది కనిపించలేదు. దాంతో వారు భయంతో ఆర్టీసి డిపోకి వెళ్లారు. ఐతే అప్పటికే వారు కొనుగోలు చేసిన బంగారం బిస్కెట్లు అక్కడకి వచ్చేసాయి. దీనికి కారణం ఓ నిజాయితీ కలిగిన వ్యక్తి.
వసుధ దంపతులు ప్రయాణించిన బస్సులోనే దుర్గయ్య అనే మరో వ్యక్తి ప్రయాణించాడు. అతడి కంటికి బస్సులో పడి వున్న బ్యాగు కనబడింది. తెరిచి చూస్తే అందులో బంగారం బిస్కెట్లు వున్నాయి. వాటిని ఆయన బస్సు కండక్టరుకి అప్పగించాడు. ఆయన వాటిని సంగారెడ్డి డిపో మేనేజరుకి అందించడంతో అలా తాము కష్టించి కొనుగోలు చేసిన బంగారం తిరిగి వారి ముందుకు వచ్చేసింది. తమ సొమ్మును నిజాయితీగా అప్పగించిన దుర్గయ్యకు వసుధ దంపతులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. దుర్గయ్యను డిపో మేనేజర్ ఘనంగా సన్మానించారు.