పూణె టెస్ట్ మ్యాచ్ : చరిత్ర సృష్టించిన కోహ్లీ... బ్రాడ్‌మెన్ రికార్డు బద్ధలు

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:42 IST)
పూణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తన కెరీర్‌లో మరో డబుల్ సెంచరీ చేశాడు. అలాగే, కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేసి.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  
 
కెరీర్‌లో కోహ్లీకిది ఏడో డబుల్ సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో 26వ సెంచరీ నమోదుచేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని దాటాడు. కాగా, బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు.  మరోవైపు, టీమిండియా 156.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 601 పరులు చేయగా, ఇదే స్కోరు వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. 
 
మొత్తం 336 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 33 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 254 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 108 పరుగులు చేయగా, తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ మోత మోగించిన ఓపెనర్ రోహిత్ శర్మ 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే, పుజారా 58, రహానే 59, రవీంద్ర జడేజా 91 పరుగుల చేశాడు. అయితే, జడేజా 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 
 
సౌతాఫ్రికా బౌలర్లలో రబాడాకు మూడు వికెట్లు, మహరాజ్, ముత్తుస్వామిలకు తలా ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి. ఆ తర్వాత సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్  చేపట్టి, 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. యాదవ్ రెండు వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్లు ఎల్గర్ ఆరు పరుగులు చేయగా, మార్క్‌రమ్ డకౌట్ అయ్యాడు. అలాగే బవుమా 8 పరుగులు చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు