పూణె టెస్ట్ : కోహ్లీ వీరవిహారం... టెస్టుల్లో 26వ సెంచరీ

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:08 IST)
పూణె వేదికగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 26వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 2019లో కోహ్లీ టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం. అలాగే, ఒక కెప్టెన్‌గా 40 సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
 
మరో ఎండ్‌లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 
 
కాగా, విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అలాగే, ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాయింట్ల పరంగా భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు