తొలి ట్వంటీ20 మ్యాచ్ : లంకేయులను చితక్కొట్టిన టీమిండియా

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (09:46 IST)
స్వదేశంలో శ్రీలంకతో భారత్ క్రికెట్ సిరీస్ మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, తొలి ట్వంటీ20 మ్యాచ్ గురువారం జరిగింది. లక్నోలో జరిగిన తొలి ట్వంటీ 20లో భారత్ జట్టు 62 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లు బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఆ తర్వాత 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్, శ్రేయాస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇషాన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేయగా, శ్రేయాస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ తొలి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి బంతికే ఓపెనర్ నిశ్శంక గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 15 పరుగుల వద్ద భువీ మరో దెబ్బకొట్టాడు. ఈ సారి ఓపెనర్ కామిల్ మిషారా (13)ను ఔట్ చేశాడు. 
 
లియనాగె (11)ను వెంకటేష్ అయ్యర్ ఔట్ చేయడంతో లంక జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయింది. అయితే, మ్యాచ్ ఆఖరులో చమిక కరుణ రత్నె 21, దుష్మంత చమీర 24లు కొంతమేరకు పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రెండో టీ20 మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో శనివారం జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు