ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన టీమిండియా మహిళల జట్టు

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (13:18 IST)
ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి నుంచి భారత మహిళల జట్టు తొలి వన్డేలో గెలుపును నమోదు చేసుకుంది. తొలి వన్డేలో ఘన విజయంతో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. 
 
ఓపెనర్ స్మృతి మంధాన (99 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 91) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఆదివారం రాత్రి ముగిసిన మొదటి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో  టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ నిర్ణీత‌‌ 50 ఓవర్లలో 227/7 స్కోరు మాత్రమే చేసింది. డేవిడ్సన్‌‌‌‌ (50 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌గా నిలిచింది. డానీ వ్యాట్(43) రాణించింది. భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 
 
కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ ఒక్కో వికెట్ పడగొట్టగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.
 
అనంతరం మంధానతో పాటు కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (74 నాటౌట్‌‌‌‌), యస్తికా భాటియా (50) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ 44.2 ఓవర్లలోనే 232/3 స్కోరు చేసి సులువుగా గెలిచింది. 
 
ఆరంభంలోనే ఓపెన్ షెఫాలీ వర్మ (1) ఔటైనా భాటియాతో రెండో వికెట్‌‌‌‌కు 96, హర్మన్ కౌర్‌‌‌‌తో మూడో వికెట్‌‌‌‌కు 99 రన్స్‌‌‌‌ జోడించిన మంధాన కొద్దిలో సెంచరీ చేజార్చుకుంది. ఆమెకే ‘ప్లేయర్ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే  బుధవారం జరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు