లలిత్ మోడీ రెడ్ కార్నర్ నోటీసు: ఈడీకి షాకిచ్చిన ఇంటర్ పోల్

సోమవారం, 7 సెప్టెంబరు 2015 (14:16 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్‌ను భారత్‌కు తిరిగి రప్పించాలని భావిస్తూ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ)కి ఇంటర్ పోల్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం లలిత్ మోడీపై 16 కేసుల్లో విచారణ జరుగుతుండగా, వాటిల్లో 15 కేసులు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద నమోదయ్యాయి.  
 
ఈ నేపథ్యంలో లలిత్ మోడీపై ఎందుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారో వెల్లడించాలని ఇంటర్ పోల్ కోరింది. అయితే దేశపు అత్యున్నత విచారణ సంస్థ రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే, దాన్ని ప్రశ్నించే హక్కు ఇంటర్ పోల్‌కు లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 
 
సీబీఐ సూచనల మేరకు ఈడీ ఈ నోటీసులు ఇచ్చిందని, దీన్ని లియోన్‌లోని ఇంటర్ పోల్ హెడ్ క్వార్టర్స్‌కు పంపామని, వారి నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదని ఈడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కాగా, లలిత్ మోడీకి నోటీసులపై ఈ నెలాఖరులోగా ఇంటర్‌పోల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి