ఆదివారం జరిగిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ షోతో రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం.. మిగతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జాసన్ రాయ్, మెకల్లమ్, రైనా, ఫించ్, దినేశ్ కార్తీక్, డ్వేన్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లతో దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్‌ను 135 పరుగులకే కట్టడి చేసింది.
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ తొమ్మిది వికెట్లతో లయన్స్‌ను చిత్తు చేసింది. గుజరాత్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి మరో 27 బంతులు మిగిలుండగానే ఛేదించింది. డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 నాటౌట్), మోసీ హెన్రిక్స్ (39 బంతుల్లో 6 ఫోర్లతో 52 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు ఘన విజయం కట్టబెట్టారు.
అంతకుముందు రషీద్ ఖాన్ (3/19), భువనేశ్వర్ కుమార్ (2/21) బౌలింగ్ ధాటికి.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37), దినేష్ కార్తిక్ (30), జాసన్ రాయ్ (21 బంతుల్లో 5 ఫోర్లతో 31) మినహా మిగతావారంతా పూర్తిగా విఫలమయ్యారు. జట్టులో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆశీష్ నెహ్రా ఒక వికెట్ పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.