భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. హార్దిక్ పాండ్యాకు దేశం తరపున క్రికెట్ ఆడటం కంటే.. డబ్బు సంపాదనకే అధిక ప్రాధాన్యత ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క క్రికెటర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని, కానీ, డబ్బు కోసం అందరూ ఐపీఎల్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్ కెప్టెన్సీని నియమించడాన్ని ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్‌కు రెండు నెలలు ముందుగా 'ఐపీఎల్‌కు రెండు నెలల ముందు మీరు గాయపడ్డారు. మీరు దేశం కోసం ఆడరు. మీరు దేశవాళీ క్రికెట్లో మీ రాష్ట్రం కోసం ఆడరు. నేరుగా ఐపీఎల్లో ఆడండి. డబ్బు సంపాదించండి. దానిలో తప్పు లేదు. కానీ మీరు రాష్ట్రం, దేశం కోసం ఆడాలి. ఇప్పుడు అందరూ ఐపీఎల్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు' అంటూ మాజీ పేసర్ అయిన ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
రెండు సీజన్లు (2022, 2023) హార్దిక్ పాండ్యా గుజరాత్‌కు ఆడాడు. ఈ రెండుసార్లు గుజరాత్ జట్టును ఫైనల్‌కు చేర్చడంతో పాటు ఒకసారి టైటిల్ కూడా అందించాడీ స్టార్ ఆల్రౌండర్. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు ముంబై కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.
ఈ విషయమై కూడా ప్రవీణ్ కుమార్ స్పందించాడు. ఫ్రాంచైజీ తన కెప్టెన్‌గా రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయడానికి బదులుగా అతనితో కట్టుబడి ఉండవచ్చని ప్రవీణ్ తెలిపాడు. 'అవును, రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేయగలడు. ఒక సంవత్సరం మాత్రమే కాదు, అతను రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు చేయగలడు. కానీ చివరికి నిర్ణయం యాజమాన్యం చేతిలో ఉంది' అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
కాగా, వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబరు 19వ తేదీన బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో హార్డిక్‌కు చీలమండ గాయమైంది. అప్పటి నుంచి అతడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నేరుగా ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నాడు. అది కూడా ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ప్రమోట్ కావడం విశేషం.
హార్డిక్ సోమవారం (మార్చి 11) ముంబై ఫ్రాంచైజీలో చేరాడు. అలాగే ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. కాగా, పాండ్యా 2021 తర్వాత మొదటిసారిగా ముంబై ఇండియన్స్ నెట్స్‌కు తిరిగి వచ్చాడు. 2021లో జరిగిన మెగా వేలంలో ఫ్రాంచైజీ హార్దిక్‌ను వదిలేసింది. దాంతో గుజరాత్ టైటాన్స్ తీసుకోవడంతో పాటు సారథిగా బాధ్యతలు అప్పగించింది.